కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-12-05T08:08:03+05:30 IST

కొవిడ్‌ టీకా మరికొద్ది వారాల్లోనే అందుబాటులోకి రానుందని ప్రధాని మోదీ ప్రకటించారు. శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని శుక్రవారం అఖిలపక్ష నేతలకు చెప్పారు...

కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్‌

  • రాష్ట్రాలతో చర్చించి ధర నిర్ణయం
  • తయారీ దశలో 8 వ్యాక్సిన్లు
  • అఖిలపక్ష భేటీలో ప్రధాని ప్రకటన
  • ముందు కోటిమంది వైద్యసిబ్బందికి
  • ఆ తర్వాత మునిసిపల్‌, పోలీసులు, ఇతర సేవా సిబ్బందికి!
  • 27 కోట్ల మంది వృద్ధులకూ టీకా


న్యూఢిల్లీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా మరికొద్ది వారాల్లోనే అందుబాటులోకి రానుందని ప్రధాని మోదీ ప్రకటించారు. శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని శుక్రవారం అఖిలపక్ష నేతలకు చెప్పారు. ఈ వీడియో లింక్‌ సమావేశంలో కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, వైసీపీ, జేడీయూ, బీజేడీ, శివసేన, టీఆర్‌ఎస్‌, బీఎస్పీ, ఎస్పీ, అన్నాడీఎంకే, బీజేపీ.. మొదలైన పార్టీల పార్లమెంటరీ నేతలు పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ ధరను రాష్ట్రాలతో చర్చించాకే నిర్ణయిస్తామని ప్రధాని చెప్పారు. దీంతో దేశీయంగా తయారైన వ్యాక్సిన్‌నే ఉపయోగిస్తామని సంకేతాలిచ్చారు. ‘దేశంలో 8 శక్తివంతమైన వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఇందులో 3 పూర్తిగా స్వదేశీ. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోంది. తక్కువ ధరలో మం చి టీకా అందించవచ్చని మన నిపుణలు చెబుతున్నా రు’’ అని ప్రధాని అన్నారు. భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్‌ కలిసి రూపొందిస్తున్న కొవాగ్జిన్‌, జైడస్‌ కేడిలా తయారుచేస్తున్న జికొవ్‌-డీ, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌- ఆస్ట్రాజెన్‌కా తయారు చేయనున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్య క్రమాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఓ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.


తొలుత దేశమంతా కోటి మంది దాకా ఉన్న ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తామని చెప్పారు. తరువాత 2 కోట్ల దాకా ఉన్న మునిసిపల్‌, పోలీస్‌, ఆర్మీ మొదలైన కీలక సహాయ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. తరువాత 27 కోట్ల దాకా ఉన్న వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటికే కొవిడ్‌ వచ్చి తగ్గినవారికి టీకా ఇస్తారా లేదా అన్నది కేంద్రం వెల్లడించలేదు. నిమ్నవర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కొన్ని పార్టీల నేతలు సూచించారు. పేద ప్రజానీకానికి టీకా ఎలా అందుతుంది, ఎంతమందికి వేస్తారు.. మొదలైన అంశాల్లో కేంద్రం వద్ద కార్యాచరణ ప్రణాళిక లేదని కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి విమర్శించారు. కాగా, వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌కు అనుభవం, సామర్థ్యం, విస్తృతమైన నెట్‌ వర్క్‌ ఉందని, గతంలో మీజిల్స్‌ లాంటి టీకాను దేశమంతా విజయవంతంగా వేసిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని మోదీ చెప్పారు. అదనపు శీతలీకరణ పరికరాలు, ఇతర సహాయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తామన్నారు. వాక్సినేషన్‌ కోసం జాతీయ స్థాయిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని వెల్లడించారు. 

Updated Date - 2020-12-05T08:08:03+05:30 IST