రెండేళ్లకోసారి వ్యాక్సిన్‌ తప్పదు!

ABN , First Publish Date - 2021-12-06T09:02:53+05:30 IST

రెండేళ్లకోసారి వ్యాక్సిన్‌ తప్పదు!

రెండేళ్లకోసారి వ్యాక్సిన్‌ తప్పదు!

  • కొన్నేళ్ల పాటు కరోనాతో పోరాడాల్సిందే.. 
  • మూడో డోస్‌గా వేరే టీకాతో సత్ఫలితం
  • మరింత సమర్థమైన వ్యాక్సిన్‌తోనే ఒమైక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లకు చెక్‌ 
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఎమోరీ వర్సిటీ వ్యాక్సిన్‌ నిపుణుడు రామారావు అమర


ఒమైక్రాన్‌ ప్రభావం ఎలా ఉంటుంది?

మైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తుండడం సర్వత్రా కలవరం కలిగిస్తోంది. వైర్‌సను బ్లాక్‌ చేసే యాంటీబాడీలు టార్గెట్‌గా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయి. అవే కాకుండా టీకా ల్లో మరో కేటగిరీ యాంటీబాడీలు ఉంటాయి. ఇన్‌ఫెక్ట్‌ అయిన సెల్స్‌ను క్లియర్‌ చేసే యాంటీబాడీలు ఎంత వరకు ఒమైక్రాన్‌ను తట్టుకుంటాయనేది తెలియదు. దీనిపై అధ్యయనం జరుగుతోంది. వారంలో దీనిపై మ రింత స్పష్టత వస్తుంది. అయితే, ఒమైక్రాన్‌ కారణంగా మరణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.


కరోనా వ్యాక్సిన్లు ఎంత కాలం సమర్థంగా పనిచేస్తాయి?

ఒక్కో కంపెనీ ఒకో ప్రాతిపదికపై వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. కొన్ని మ్యుటేషన్స్‌పై వ్యాక్సిన్‌లు ఎక్కువ కాలం ప్రభావం చూపలేవు. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో కనిపించిన బీటా వైర్‌సపై వ్యాక్సిన్లు సమర్థంగా పని చేయడం లేదు. మోనో క్లోనల్‌ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్ల ప్రభావం కూడా కొన్ని నెలలకు తగ్గుతోంది. వెక్టర్‌ ఆధారిత వ్యాక్సిన్లు ఎక్కువ కాలం పని చేస్తున్నాయి. ప్రొటీన్‌ ఆధారిత వ్యాక్సిన్లు దీర్ఘకాలం ప్రభావం చూపడం లేదన్న అంచనాలున్నాయి. ఏ వ్యాక్సిన్‌ ఖచ్చితంగా ఎంత కాలం పనిచేస్తుందనే అంశంపై డేటా రావాల్సి ఉంది.


వ్యాక్సిన్ల తయారీలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం మారాలంటారా?

ఎక్కువ కాలం పని చేసే టీకాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించడం తక్షణ అవసరం. అంతే కాదు ఎక్కువ వేరియంట్లపై ప్రభావం చూపే టీకాల వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. రక్తంలో ఇమ్యూనిటీ పెరిగినా ఊపిరితిత్తుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వ్యాక్సిన్‌ ఎక్కువ కాలం పనిచేయదు. టీ సెల్స్‌ ప్రతిస్పందనలను పెంచితే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాంటి టీకా అభివృద్ధికి మేం కృషి చేస్తున్నాం. న్యూక్లియో క్యాప్సుల్‌కు అదనంగా నాలుగు ప్రొటీన్‌ జీన్‌లను జత చేస్తున్నాం. దీనివల్ల టీకా చురుకుగా పనిచేస్తుంది. ్ల ఎలాంటి వేరియంట్‌నైనా ఎదుర్కొంటుంది. ఇతర టీకాలు తీసుకున్న వారు ఇలా అభివృద్ధి చేసిన టీకాను బూస్టర్‌ డోస్‌గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.


బూస్టర్‌ డోస్‌ ఆలోచనలు ఎంత వరకు సమంజసం?

టీకాలు అందుబాటులో ఉంటే బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం ఉత్తమం. అమెరికా వంటి దేశాలు బూస్టర్‌ డోస్‌లు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నాయి. అందరికీ ఇవ్వలేకపోయినా ఆరోగ్య కార్యకర్తలు, అనారోగ్యంతో ఇబ్బంది పడే వారికైనా వీలైనంత వేగంగా బూస్టర్‌ డోస్‌లు ఇవ్వడం మంచిది. తద్వారా వైరస్‌ కారణంగా ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ప్రాణాపాయ స్థితికి వెళ్లే ప్రమాదాన్ని నివారించగలిగితే శాస్త్రవేత్తలు నిజంగా విజయం సాధించినట్లే.


రెండు టీకాలు తీసుకున్న వారు మూడో డోస్‌గా వేరే కంపెనీ టీకా తీసుకోవచ్చా?

బూస్టర్‌ డోస్‌గా వేరే కంపెనీ టీకా తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గానూ పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


భవిష్యత్తులో ఏటా కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలంటారా?

కొన్నేళ్ల పాటు కరోనా వైర్‌సను భరించక తప్పదు. ఒమైక్రాన్‌ వంటి మరిన్ని రకాల వేరియంట్లు భవిష్యత్‌లో వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రతి 2, 3 ఏళ్లకు ఒకసారి టీకాలు తీసుకోకతప్పదు. అప్పుడే వైరస్‌ తీవ్రతను అడ్డుకోగలం. ప్రజలు మాస్క్‌లు ధరించడం, గుమిగూడకపోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఇమ్యూనిటీ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

- స్పెషల్‌ డెస్క్‌



‘‘ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు తక్కువ కాలం మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలం వైర్‌సను అడ్డుకునే టీకాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలి. అలాంటి వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం మేం కృషి చేస్తున్నాం. మరి కొన్నేళ్ల వరకు మనం కరోనాతో పోరాడాల్సిందే. దాన్ని అడ్డుకునేందుకు 2, 3 ఏళ్లకు ఒకసారి వ్యాక్సిన్‌ తీసుకోవడం అనివార్యం కావచ్చు’’ అని అమెరికాలోని ఎమోరీ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అమర రామారావు అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆయన బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సె్‌సలో డాక్టరేట్‌ పొందారు. రెండు దశాబ్దాలుగా టీకాలపై పరిశోధనలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌పై పరిశోధన చేస్తున్న అతికొద్ది మందిలో రామారావు ఒకరు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం, కరోనా మహమ్మారిపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

Updated Date - 2021-12-06T09:02:53+05:30 IST