60 ఏళ్లకు పైబడిన వారందరికీ.. 1 నుంచి టీకా

ABN , First Publish Date - 2021-02-25T06:46:34+05:30 IST

ఇక సామాన్యులకూ కరోనా టీకా అందనుంది. మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న రెండోవిడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోట్లాది మందికి టీకాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

60 ఏళ్లకు పైబడిన వారందరికీ.. 1   నుంచి   టీకా

  • 45 ఏళ్లకు పైబడి, కో-మార్బిడిటీస్‌ కలిగిన వారికీ వ్యాక్సినేషన్‌
  • 10వేల ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ఉచితం
  • 20వేల ప్రైవేటు కేంద్రాల్లో చెల్లింపుపై టీకా 
  • కోమార్బిడిటీస్‌, టీకా ధరపై త్వరలో ప్రకటన
  • ఈదఫాలోనే ప్రధాని మోదీకి టీకా?


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : ఇక సామాన్యులకూ కరోనా టీకా అందనుంది. మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న రెండోవిడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోట్లాది మందికి టీకాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు అందగా.. ఇక నుంచి 60 ఏళ్లకు పైబడినవారు, 45 ఏళ్లకు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధుల (కో- మార్బిడిటీ్‌స)తో బాధపడే వారికి ప్రాధాన్య ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.


ఈ వర్గాలకు చెందిన లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది ఉంటారని అంచనా. అందులో దాదాపు 10 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారే. 10 వేల ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఉచితంగా, 20 వేల ప్రైవేటు కేంద్రాల్లో చెల్లింపు పద్ధతిలో వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో టీకా ధర ఎంత ఉండాలి? కో - మార్బిడిటీస్‌ జాబితాలోకి వచ్చే వ్యాధులేంటి? అనేది త్వరలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈమేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు వెల్లడించారు. 


45 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికిగానూ.. తమకు కో-మార్బిడిటీస్‌ ఉన్నాయని ధ్రువీకరించే ఆరోగ్య నివేదికల పత్రాలను చూపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. టీకా ధరపై ప్రస్తుతం ఆస్పత్రులు, టీకా ఉత్పత్తి సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రుల్లో చాలామంది డబ్బులు చెల్లించి టీకాలు వేయించుకోవాలని యోచిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇదే విడతలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టీకా తీసుకుంటారని తెలుస్తోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి 1,21,65,598 మందికి టీకాలు వేసినట్లుఆరోగ్యశాఖ పేర్కొంది. 




కో-మార్బిడిటీస్‌ ధ్రువీకరణ ఇలా.. 

45 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకునేందుకు అర్హత సాధించాలంటే.. తమకు కో-మార్బిడిటీస్‌ ఉన్నాయనే మెడికల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. టీకా కేంద్రంలో ఇచ్చే ఒక పేజీ దరఖాస్తు పత్రంలో ఆరోగ్య సమస్యలు, వ్యాధుల వివరాలతో పలు ప్రశ్నలు ఉంటాయి. వాటికి సూటిగా ‘అవును’, ‘కాదు’ అనే రూపంలో సమాధానాలను టిక్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తు పత్రాన్ని తీసుకెళ్లి వైద్యుడితో ధ్రువీకరణ చేయించుకోవాలి.


దాన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రంలో సమర్పించగానే టీకా వేస్తారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వ్యాధులతో పాటు మధుమేహం, కేన్సర్‌, తీవ్ర ఆస్తమా, మానసిక రుగ్మతలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటాన్ని కోమార్బిడిటీ్‌సగా పరిగణించే అవకాశం ఉంది. ఎముక మజ్జ, స్టెమ్‌ సెల్‌, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారూ ఈ విభాగంలోకి రావచ్చు. ప్రైవేటులో కరోనా టీకా ధర రూ.300లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2021-02-25T06:46:34+05:30 IST