89,773 మంది తల్లులకు టీకా

ABN , First Publish Date - 2021-06-23T06:00:12+05:30 IST

మూడో వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

89,773 మంది తల్లులకు టీకా
డాక్టర్‌ జీవన్‌రాణి

జిల్లాలో శరవేగంగా వ్యాక్సినేషన్‌ 

1,47,924 మంది తల్లులున్నట్టు గుర్తింపు

విశాఖపట్నం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): మూడో వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. థర్డ్‌ వేవ్‌లో ఎక్కువగా చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలు నేపథ్యంలో వారికి అత్యంత దగ్గరగా ఉండే తల్లులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు అధికారులు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. జిల్లాలో 1,47,924 మంది 0-5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులను అధికారులు గుర్తించారు. పది రోజుల కిందట నుంచి వీరికి వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఇప్పటివరకు 89,773 మంది తల్లులకు వ్యాక్సిన్‌ను అందించారు. మరో 58,151 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది. వీరందరికీ మరో నాలుగు రోజుల్లో వ్యాక్సిన్‌ అందించేలా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జీవన్‌రాణి తెలిపారు. ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు వేల మంది తల్లులకు వ్యాక్సిన్‌ అందిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులను గ్రామాలు, వార్డుల వారీగా గుర్తించి వారిని వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తీసుకువస్తున్నామని, ఇందుకోసం గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సేవలను వినియోగించుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T06:00:12+05:30 IST