టీకా నిల్వలు నిండుకుంటున్నాయి.. వ్యాక్సినేషన్ మధ్యలోనే ఆగిపోవచ్చు: రాజస్థాన్

ABN , First Publish Date - 2021-03-09T21:28:39+05:30 IST

కేంద్రం ఆదుకోని పక్షంలో రాజస్థాన్‌లో టీకా పంపిణీ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవచ్చని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా స్పష్టం చేసింది.

టీకా నిల్వలు నిండుకుంటున్నాయి.. వ్యాక్సినేషన్ మధ్యలోనే ఆగిపోవచ్చు: రాజస్థాన్

జైపూర్:  కేంద్రం ఆదుకోని పక్షంలో రాజస్థాన్‌లో టీకా పంపిణీ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవచ్చని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా స్పష్టం చేసింది. మరో మూడు రోజులకు సరిపడా మాత్రమే రాష్ట్రంలో టీకా నిల్వలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా సాగుతోందని రెండో డోసు తీసుకోవాల్సిన వారికే ప్రస్తుతం టీకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారమందించారు. మరిన్ని టీకాలను రాష్ట్రానికి పంపించాలంటూ కేంద్రాన్ని కోరారు. ‘ప్రస్తుతం మా వద్ద ఉన్న టీకా నిల్వలు మూడు రోజులకు మాత్రమే సరిపోతాయి. కేవలం మార్చి నెలకే మాకు 60 లక్షల టీకా డోసులు అవసరమవుతాయని కేంద్రానికి ఇదివరకే సమాచారమిచ్చాం. మాకు టీకాలు అందని పక్షంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.


అయితే..కేంద్ర మాత్రం రాజస్తాన్ వాదనను తోసి పుచ్చింది. రాష్ట్రానికి మొత్తం 37.61 లక్షల డోసులను పంపించామని, సోమవారం వరకూ రాజస్థాన్‌లో 24.28 లక్షల టీకాలు మాత్రమే వినియోగమయ్యాయని పేర్కొంది. ‘రాష్ట్రంలో టీకాల కొరత లేదు.. వాస్తవం ఇదే. రాష్ట్రల్లో టీకా వినియోగం ఎలా ఉందీ, టీకా నిల్వలు ఎంత ఉన్నాయనే విషయాలను కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు టీకాలను సరఫరా చేస్తున్నాం. అని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇక అధికారిక లెక్కల ప్రకారం.. శనివారం నాటికి రాజస్థాన్‌లో దాదాపు 16 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు.  


Updated Date - 2021-03-09T21:28:39+05:30 IST