వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను పూర్తి చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను పూర్తిచేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన టీకా పంపిణీ కేంద్రాన్ని శుక్ర వారం కలెక్టర్‌ పరిశీలించారు.

వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను పూర్తి చేయాలి: కలెక్టర్‌
రిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

నేడు ప్రారంభం కానున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకా

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 15: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను పూర్తిచేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన టీకా పంపిణీ కేంద్రాన్ని శుక్ర వారం కలెక్టర్‌ పరిశీలించారు. పట్టణంలోని రిమ్స్‌ శాంతినగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, ఉట్నూర్‌ సీహెచ్‌సీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ కేంద్రంలో 30 మంది చొప్పున టీకా వేయనున్నారని తెలిపారు. మొదటి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్‌రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి విజయసారథి, ప్రత్యేక అధికారి వైసీ శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి 

కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జిల్లాలో 3 కేంద్రాల ద్వారా ఫ్రంట్‌లైన్‌ వారియర్‌ ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డ్రైరన్‌ నిర్వహించి వ్యాక్సినేటర్లకు అవగాహన కల్పించారు. కాగా శుక్ర వారం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యాక్సి నేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సాధన నేతృత్వంలో డీఐఓ విజయసారథి ప్రాజెక్టర్‌ ద్వారా పలు విషయాలను తెలియ జేశారు. వ్యాక్సిన్‌ భద్రపర్చడంతో పాటు గదిలో వసతులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ఈ సందర్భంగా డా. సాధన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సిబ్బందికి టీకాలను వేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. స్థానిక రిమ్స్‌లో నాలుగు కేంద్రాలు, శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌తో పాటు ఉట్నూర్‌లోని సీహెచ్‌సీలో టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌, వ్యాక్సిన్‌ రూం ఇన్‌చార్జీ శ్రీకాంత్‌, వ్యాక్సినేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST