కోవాగ్జిన్‌ టీకాలు మాయం

ABN , First Publish Date - 2021-05-17T05:21:05+05:30 IST

కోవాగ్జిన్‌ టీకాలు మాయం

కోవాగ్జిన్‌ టీకాలు మాయం

బందరులోని నారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఘటన

వెయ్యి డోసుల్లో 40 మాయం

కేసు నమోదు.. పోలీసుల విచారణ

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : మచిలీపట్నంలోని నారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటరులో 40 డోసుల కోవాగ్జిన్‌ టీకాలు మాయం కావడం కలకలం రేపింది. వెయ్యి డోసుల్లో 40 మాయం కావడంపై సదరు డాక్టర్‌.. శనివారం చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు నర్సులపై కేసు నమోదు చేశారు. 

ఎవరిది తప్పు..?

నారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే నర్సులంతా అధికార పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్‌ సాయంతో ఆదివారం మంత్రి పేర్నినానీని కలిసి తమ తప్పులేదని చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడా అధికారులు అందుబాటులో లేకపోవడంతో  వెనుదిరిగారు. వెయ్యి డోసుల కోవాగ్జిన్‌ టీకాలు ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదైంది. అయితే, నారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నర్సులు మాత్రం తక్కువ డోసులు ఇచ్చారని చెబుతున్నారు. వాస్తవానికి డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం నుంచి నర్సులకు నేరుగా వ్యాక్సిన్‌ డోసులను ఇవ్వకూడదని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనం ద్వారా అర్బన్‌ హెల్త్‌ సెంటరుకు తీసుకువెళ్లి ఇవ్వాల్సి ఉందని జిల్లా వైద్యశాఖ కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. 

ఆ 40 డోసులు ఏమైనట్టు?

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 40 డోసులకు సంబంధించిన వేల్స్‌ ఎక్కడ మాయమయ్యాయనే అంశంపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.  డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలోనే తక్కువ డోసులు ఇచ్చారని నర్సులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రమేశ్‌రెడ్డి తెలిపారు. కాగా, పట్టణంలోని ప్రముఖులకు వేసేందుకు ఈ టీకాలను కావాలనే దారి మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి.

జి.కొండూరు పీహెచ్‌సీలో డాక్టర్‌ సస్పెన్షన్‌

జి.కొండూరు పీహెచ్‌సీలో టీకాలు మాయంపై విచారణ చేసిన అధికారులు ఒక వైద్యుడిని సస్పెండ్‌ చేశారు. అయితే, ఈ పీహెచ్‌సీలో పనిచేసే మరో మహిళా వైద్యురాలిని అధికారులు వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 5 ఎంఎల్‌ టీకాను వేయాల్సి ఉండగా, 1 ఎంఎల్‌ మాత్రమే టీకా వేసి మిగిలిన దానిని బయటకు తరలిస్తున్న విషయాన్ని గమనించిన ఓ నర్సు నిలదీయడం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈ అంశంపైనా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయని జిల్లా వైద్యశాఖ కార్యాలయం సిబ్బంది చెప్పుకొంటున్నారు. 

Updated Date - 2021-05-17T05:21:05+05:30 IST