వ్యాక్సిన్‌ వేదన

ABN , First Publish Date - 2021-05-16T05:13:00+05:30 IST

వ్యాక్సిన్‌ వేదన

వ్యాక్సిన్‌ వేదన
గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో వ్యాక్సినేషన్‌ కోసం..

ఇళ్లకు పంపిణీ చేయని టోకెన్లు

సెల్‌ నెంబర్‌కు మెసేజ్‌ రాకపోతే రెండో డోసు లేనట్టే..!

కనిపించని ప్రత్యామ్నాయం

ఇబ్బందులు పడుతున్న వృద్ధులు

పాపయమ్మ.. వయస్సు 60 ఏళ్లు. చిట్టినగర్‌ కొండ ప్రాంతంలో నివసిస్తుంది. కొద్దిరోజుల క్రితం కృష్ణలంక ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకుంది. ఆ సమయంలో ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. 28 రోజులు గడువు పూర్తికావడంతో రెండో డోసు వ్యాక్సిన్‌కు టోకెన్‌ తీసుకుంది. దాన్ని తీసుకుని కేబీఎన్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లింది. మొదటి డోసు వేయించుకున్నప్పుడు సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించమని అక్కడి సిబ్బంది అడిగారు. తన ఫోన్‌కు ఎలాంటి మెసేజ్‌ రాలేదని ఆమె చెప్పింది. ఆధార్‌ కార్డు, ఫోన్‌ నెంబర్‌ ఇచ్చినప్పటికీ మెసేజ్‌ రాలేదన్న కారణంగా ఆమెను అక్కడి  నుంచి పంపేశారు. 

ఇలా.. నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారింది. అర్థంలేని నిబంధనలతో వృద్ధులను అగచాట్లకు గురి చేస్తున్నారు. టోకెన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియక రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది.

విజయవాడ, ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌ : ఒక వ్యాక్సిన్‌ వంద తిప్పలు పెడుతోంది. సచివాలయాలు, వ్యాక్సిన్‌ కేంద్రాల్లోని సిబ్బంది అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడ్డాక చిన్నచిన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తిప్పి పంపేస్తున్నారు. ఫలితంగా వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 12 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో వచ్చిన వారికి వచ్చినట్టుగా వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

నిబంధనలతో తలనొప్పి

వీఎంసీ ఏర్పాటుచేసిన వ్యాక్సిన్‌ కేంద్రాల్లో వాటి పరిధిలోని వారికి మాత్రమే మార్గదర్శకాలను రూపొందించారు. ఒక్కో వ్యాక్సిన్‌ కేంద్రానికి ఐదు శ్లాట్లు కేటాయించారు. ఒక్కో శ్లాటులో 100 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. మొత్తంగా 12 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ఐదు శ్లాటుల్లో కలిపి రోజుకు 6వేల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నది అధికారులు లక్ష్యం. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేయడానికి ప్రాధాన్యతా క్రమంలో టోకెన్లు పంపణీ చేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా టోకెన్లు ముందురోజే పంపిణీ చేస్తే, ఆ మర్నాడు ప్రజలు వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్తారు. శనివారం ఇచ్చే వ్యాక్సిన్‌కు సంబంధించి శుక్రవారం జరగాల్సిన టోకెన్ల పంపిణీ జరగలేదు. ఫలితంగా వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చినవారు అక్కడికక్కడే టోకెన్లు తీసుకుని వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి వచ్చింది. కొన్ని కేంద్రాల్లో టోకెన్లు అలాగే ఉండిపోయాయి. 

ఆధార్‌ కాదు.. ఫోన్‌ నెంబరే కీలకం

వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆధార్‌, ఫోన్‌ నెంబర్లు ఇవ్వాల్సిందే. మొదటి డోసు తీసుకున్న వారి ఫోన్‌ నెంబర్‌కు ఒక మెసేజ్‌ వస్తుంది. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్‌ కేంద్రంలో ఆధార్‌ నెంబర్‌తో పాటు మొదట్లో సెల్‌ నెంబరుకు వచ్చిన మెసేజ్‌ను చూపించాలి. సెల్‌ నెంబర్‌ కంప్యూటర్‌లో నమోదు చేసినప్పుడు ఒక అంకె తప్పుగా కొట్టినా, అక్కడి సిబ్బందికి సెల్‌ నెంబర్‌ తప్పుగా చెప్పినా మెసేజ్‌ రాదు. ఫలితంగా రెండో డోసు తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఇదే జరుగుతోంది. తమ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రాలేదని మొదటి డోసు తీసుకున్న వారు చెబుతున్నారు. దానికి తామేమీ చేయలేమని వ్యాక్సిన్‌ కేంద్రాల నోడల్‌ అధికారులు చెప్పి, వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డును కాకుండా ఫోన్‌ నెంబర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని నోడల్‌ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే  తాము ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. 

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇబ్బందులున్న చోట పరిష్కరిస్తున్నాం. టోకెన్లను ఒక్కరోజే పంపిణీ చేయలేదు. దీనికి కారణం శనివారం వేయాల్సిన వ్యాక్సిన్‌ శుక్రవారం రాత్రి 11 గంటలకు వచ్చింది. దీనివల్ల టోకెన్లు పంపిణీ చేయడం వీలు కాలేదు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆధార్‌ కాకుండా ఫోన్‌ నెంబర్‌ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల దాన్నే నోడల్‌ అధికారులు ప్రామాణికంగా తీసుకుంటారు. 

- ప్రసన్న వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌




Updated Date - 2021-05-16T05:13:00+05:30 IST