టీకా..కాక!

ABN , First Publish Date - 2021-05-11T08:25:11+05:30 IST

వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సోమవారం ఎక్కడా వ్యాక్సిన్‌ వెయ్యలేదు. మంగళవారం కూడా కృష్ణా జిల్లాతోపాటు గుంటూరులో మాత్రమే పరిమితంగా వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలుస్తోంది

టీకా..కాక!

వ్యాక్సిన్‌ దొరక్క జనం గగ్గోలు

నిన్న ఎక్కడా అందని వ్యాక్సిన్‌

నేడు కూడా పరిమితంగానే టీకా

నెలాఖరు వరకు సెకండ్‌ డోస్‌ మాత్రమే

జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకూ ఇదే వర్తిస్తుంది

రాష్ట్రంలో సెకండ్‌ డోస్‌ కోసం 50 లక్షల మంది ఎదురుచూపులు

నెలాఖరులోపు వారందరికీ వేస్తే 1వ తేదీ నుంచి ఫస్ట్‌ డోస్‌ కూడా!

ఇంటింటికీ స్లిప్‌ల పంపిణీ యోచన!

వ్యాక్సినేషన్‌లో అధికారుల ‘సొంత’ పంథా

వచ్చింది వచ్చినట్లుగా ఫస్ట్‌ డోస్‌కే వాడకం

కేంద్ర మార్గదర్శకాలు బుట్టదాఖలు

ఇప్పుడు.. కేంద్రానికి లేఖల మీద లేఖలు


అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సోమవారం ఎక్కడా వ్యాక్సిన్‌ వెయ్యలేదు. మంగళవారం కూడా కృష్ణా జిల్లాతోపాటు గుంటూరులో మాత్రమే పరిమితంగా వ్యాక్సినేషన్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఇక... ఈనెల 31 వరకు రాష్ట్రంలో సెకండ్‌ డోస్‌ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.  ఇప్పటికే గత రెండు వారాల నుంచి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను ఆరోగ్యశాఖ నిలిపేసింది. దానిని మే 31 వరకూ పొడిగించింది. అప్పటికి కూడా అందరికీ ‘సెకండ్‌ డోస్‌’ ఇవ్వలేకపోతే... మొదటి డోస్‌ను మరికొంత కాలం నిలిపివేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 72,93,952 మంది లబ్ధిదారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. ఇందులో సుమారు 20 లక్షల మందికి మాత్రమే సెకండ్‌ డోస్‌ వేశారు. దాదాపు 50 లక్షల మందికి సెకండ్‌ డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ‘బూస్టర్‌ డోస్‌’ కోసం జనం వ్యాక్సిన్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. 18 నుంచి 45 మధ్య వయసు వారికోసం కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్‌ను కూడా సెకండ్‌ డోస్‌ కోసమే ఉపయోగించాల్సి వస్తోంది.  ఇక... 18-45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి ఇప్పట్లో వ్యాక్సిన్‌ ఇవ్వలేమని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. తొలిదశలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ... చాలామంది దానిని వినియోగించుకోలేదు.ఇప్పుడు వారికి కూడా ఫస్ట్‌ డోస్‌ ఇవ్వకూడదని నిర్ణయించారు. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకున్న వారికి మినహాయింపు ఉంటుంది. మరోవైపు... ఏపీలో వ్యాక్సినేషన్‌ మందగమనంతో సాగుతోందని, వేగం పెంచాలని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఆడిషనల్‌ సెక్రటరీ ఏపీకి లేఖ రాశారు.


ఏమిటి కారణం...

సెకండ్‌ డోస్‌ కోసం లక్షల మంది వేచి చూడాల్సిన పరిస్థితికి అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, కేటాయింపులను అంచనా వేయలేకపోయారు. కేంద్రం మార్గదర్శకాలు పాటించకుండా... సొంత నిబంధనలు పెట్టుకున్నారు. తాము ఇచ్చిన వ్యాక్సిన్‌లో సగం మాత్రమే మొదటి డోస్‌కు వాడాలని,. మిగిలిన సగం రెండో డోస్‌కు స్టోర్‌ చేసుకోవాలని తొలి నుంచి చెబుతూనే ఉంది. కానీ... ‘వచ్చింది వచ్చినట్లు వాడేద్దాం! కేంద్రం వ్యాక్సిన్‌ ఎందుకు ఇవ్వదో చూద్దాం’ అంటూ మన అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. దాని ఫలితమే... ఈ పరిస్థితి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఇచ్చిన గడువు దాటినా బూస్టర్‌ డోస్‌ అందని వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పుడు కళ్లు తెరిచిన ఆరోగ్యశాఖ అధికారులు సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. 


ఎన్ని లేఖలు రాసినా... 

కేంద్రం ముందుగా నిర్ణయించిన ప్రకారమే రాష్ట్రానికి వ్యాక్సిన్‌ కేటాయిస్తోంది. సీఎం జగన్‌ దగ్గర నుంచి ఆరోగ్యశాఖ కమిషనర్‌ వరకూ లేఖల మీద లేఖలు రాసినా కేంద్రం నుంచి స్పందన కనిపించడంలేదు. తమ రాష్ట్రానికి కోటి వ్యాక్సిన్లు పంపించాలని, లేదంటే సెకండ్‌ డోస్‌కు ఇబ్బంది అవుతుందని సీఎం జగన్‌ కేంద్రానికి ఇప్పటికే అనేకసార్లు లేఖలు రాసారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. వారు ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే తప్ప అదనంగా ఒక్క డోస్‌ కూడా ఇవ్వడం లేదు. పైగా తామిచ్చిన మార్గదర్శకాలు ఎందుకుం పాటించడంలేదంటూ కేంద్ర అధికారులు నిలదీస్తున్నారు.


ఇళ్లకు స్లిప్పుల పంపిణీ

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతుండటంతో.... జిల్లాల్లో ఎక్కడిక్కడ వ్యాక్సినేషన్‌కు అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా... ఓటరు స్లిప్పుల్లాగానే ఇంటింటికీ వ్యాక్సిన్‌ స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు, సాధారణ ప్రజలు (45 నుంచి 60 ఏళ్లలోపు)... ఇలా మూడు కేటగిరీల స్లిప్‌లను ఒకటో డోస్‌, రెండో డోస్‌కు విడి విడిగా ముద్రిస్తారు. ఏ రోజు, ఎక్కడ, ఏ సమయంలో వ్యాక్సిన్‌ ఇస్తారో దానిపై వివరిస్తారు. దాని ప్రకారమే ఆయా కేంద్రాలకు వెళ్లి స్లిప్‌ చూపించి, వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన గందరగోళం నివారించవచ్చుని భావిస్తున్నారు.

Updated Date - 2021-05-11T08:25:11+05:30 IST