టీకా తంత్రం

ABN , First Publish Date - 2021-03-02T06:26:17+05:30 IST

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి, పదమూడు నెలలు అవుతోంది. తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించి ఏడాది అవుతోంది. సోమవారం నాడు కొవిడ్ టీకాల పంపిణీ...

టీకా తంత్రం

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి, పదమూడు నెలలు అవుతోంది. తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించి ఏడాది అవుతోంది. సోమవారం నాడు కొవిడ్ టీకాల పంపిణీ రెండో దశ దేశవ్యాప్తంగా మొదలయింది. జనవరి పదహారు నాడు మొదలైన మొదటి దశ ప్రధానంగా, వైరస్‌తో అధికంగా వ్యవహరించవలసి వచ్చే ఆరోగ్య సిబ్బందికి, పోలీసు తదితర పౌరసేవల సిబ్బందికి ఉద్దేశించింది కాగా, విస్తృత ప్రజానీకానికి పంపిణీ చేసే క్రమం ఈ దశలో ప్రారంభం అవుతోంది. అరవై సంవత్సరాలు పైబడిన వారు, నలభై అయిదేళ్లు పైబడి దీర్ఘ వ్యాధులున్నవారు ఈ దశలో టీకాను పొందుతారు. ప్రజలందరికీ నమూనాగా ఆదర్శంగా ఉండవలసిన నాయకుడు వ్యవహరించవలసిన తీరులోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సోమవారం నాడు తొలి గడియల్లోనే, ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టకుండా అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో టీకా వేయించుకున్నారు. నిర్దిష్ట వయోశ్రేణిలోని ప్రజలు కోవిన్ అప్లికేషన్ ద్వారా నమోదు చేయించుకుని, టీకాలు వేయించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మొదటి దశలో ఇప్పటివరకు కోటీ 43డోసుల టీకాలు వేసారు. కేవలం 25 లక్షల మంది మాత్రమే రెండు డోసులతో పూర్తిగా టీకా స్వీకరించారు. జనాభాలో ఇది ఒక శాతంలో పదోవంతు మాత్రమే. లక్ష్యంగా పెట్టుకున్న జనశ్రేణిలో అందరూ ముందుకు రాలేదని అర్థమవుతూనే ఉన్నది. ప్రాణాంతక వ్యాధి ఉధృతంగా ఉన్న రోజుల్లో, దీనికి విరుగుడు తొందరగా రావాలని అందరూ కోరుకున్నవారే. కానీ, తీరా అది అందుబాటులోకి వచ్చిన తరువాత, చాలా మంది వెనుకాడుతున్నారు. ఇందుకు కారణాలు ఊహించడం కష్టమేమీ కాదు. పరిశోధన ప్రయోగాలు ఆనవాయితీ ప్రకారం అన్ని దశలూ పూర్తిచేసుకుని, వినియోగంలోకి రావడం కాక, హడావుడిగా అత్యవసర వినియోగం కోసం విడుదల చేయడం, దానికి సంబంధించి వైద్య, వైజ్ఞానిక బృందాల నుంచి అభ్యంతరాలు వెలువడడం ప్రజలలో సందేహాలను కలిగించాయి. దానికి తోడు, టీకాలు వేయించుకున్న వారిలో కొందరికి వికటించినట్టు వచ్చిన వార్తలు కూడా భయం కలిగించాయి. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినందున, కీలకమయిన దశ అంతా దాటాము కాబట్టి, తొందరపడి టీకా వేయించుకోవలసిన అవసరం లేదని, వేచి చూద్దామని మరికొందరు భావించి ఉండవచ్చు. ఫలితంగా, మొదటి దశ టీకాకరణలో ప్రజలనుంచి పెద్దగా స్పందన లేదు. ఇప్పుడిప్పుడే, టీకా రెండో డోసు కూడా వేసుకున్నవారిలో ప్రతిక్రియలు ఉన్నట్టు పెద్దగా నమోదు కావడం లేదు కాబట్టి, నమ్మకం పెరుగుతోంది. నిజానికి, టీకాల పంపిణీ జరుగుతున్న సంఖ్యలో వికటించిన కేసుల సంఖ్య ఆవగింజంత కూడా లేదు. ఇప్పుడు ప్రధాని వంటి వ్యక్తి టీకా వేసుకుని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, వయోధికులు ముందుకు వచ్చి టీకాను స్వీకరిస్తారని ఆశిద్దాము.


టీకా కార్యక్రమం సందర్భంగా వైద్యులను, కోవాగ్జిన్ ఆవిష్కరణకు కారకులైన శాస్త్రజ్ఞులను ప్రశంసించడం అంతా బాగానే ఉంది కానీ, టీకామందులో రాజకీయాన్ని మిళితం చేయకుండా మాత్రం ప్రధానమంత్రి ఉండలేరా అని సందేహం కలుగుతుంది. టీకా వేయించుకున్నవారికి ఇచ్చే సర్టిఫికేట్టుపై ప్రధానమంత్రి ఫోటో అవసరమా? అమెరికాలోనూ, ఇంగ్లండులోను ఎక్కడా ఆ పద్ధతి లేదే? పైగా, నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఈ సర్టిఫికేట్ల ప్రచారం సరైనదేనా? గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో, అప్పటికే మొదలైన మొదటి దశ టీకా కార్యక్రమంలో ఇచ్చిన తాత్కాలిక సర్టిఫికేట్లపై కూడా ప్రధాని ఫోటో ప్రచురిస్తే, ఎన్నికల అధికారులు అభ్యంతరం పెట్టారు. అయినా, అదే పద్ధతి జాతీయస్థాయిలోనూ అనుసరిస్తున్నారు. కోవిడ్‌ను ప్రస్తుత భారత ప్రభుత్వం అన్నివిధాల గొప్పగా ఎదుర్కొన్నదని జాతీయ అధికారపార్టీ వారు సైతం చెప్పుకుంటారనుకోలేము. వలసకూలీల దారుణ యాతన మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్న చిరుద్యోగులు, కేంద్రసాయం అందక అలమటించిన రాష్ట్రాలు, కరోనా కాలం ఎటువంటిదో చెప్పగలవు. ఇక, వైద్య ఆరోగ్య రంగం ఈ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా సమకూర్చుకున్న హంగులేమీ లేవు. పాత వ్యవస్థతోనే, పాత సిబ్బందితోనే, ఏ ప్రభుత్వంలో అయినా చేసే అంకితభావంతోనే సిబ్బంది పనిచేశారు. అయినా, దేశం గర్వించవలసిన చోట, ఒక నాయకుడి వ్యక్తిపూజ ఏమిటి?


నిజానికి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసే రాజకీయ సలహాదారులను అనాలి. మోదీకి టీకా వేసింది పుదుచ్చేరికి చెందిన పి. నివేద అనే నర్సు, సహాయం చేస్తున్న మరొక నర్సు కేరళకు చెందినవారు. ఇక టీకా తీసుకుంటున్న సమయంలో ప్రధాని ధరించింది అస్సామీ కండువా ‘గమ్చా’. ఈ మూడు ప్రాంతాలూ త్వరలో ఎన్నికలకు వెళ్లేవి అని వేరే చెప్పనక్కరలేదు. క్రికెట్ ఆటగాడికి ఆసాంతం వ్యాపార చిహ్నాలు ఉన్నట్టు, ప్రధాని రూపం, వాచకం అన్నీ రాజకీయ సందేశాలే అయితే ఎట్లా?

Updated Date - 2021-03-02T06:26:17+05:30 IST