నేటి నుంచి వ్యాక్సినేషన్‌ షురూ

ABN , First Publish Date - 2021-01-16T06:50:37+05:30 IST

గత తొమ్మిది నెలల నుంచి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్‌కట్టడి చేసేందుకు అష్టదిగ్బంధం మొదలైంది

నేటి నుంచి వ్యాక్సినేషన్‌ షురూ
నిర్మల్‌ జిల్లాకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్‌

కొవిడ్‌పై పోరుకు సర్వం సిద్ధం 

నేడు జిల్లాలో 90 మంది వైద్యసిబ్బందికి టీకాలు 

నిర్మల్‌లో రెండు, భైంసాలో ఒక కేంద్రం 

18 నుంచి రెండో దశ కింద 25 కేంద్రాల్లో.. 

పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టిన యంత్రాంగం 

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

నిర్మల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : గత తొమ్మిది నెలల నుంచి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్‌కట్టడి చేసేందుకు అష్టదిగ్బంధం మొదలైంది. కరోనావ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ప్రయోగాత్మకంగా వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దశలవారీగా వ్యాక్సినేషన్‌ను చేపట్టి ఎలాంటి అపోహలకు తావు లేకుండా చూడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లాకు అవసరమైన మేరకు వ్యాక్సిన్‌లు చేరుకున్నాయి. స్థానిక జిల్లా ఆసు పత్రితో పాటు రాంనగర్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, అలాగే భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఒక్కోకేంద్రంలో 30 మందికి చొప్పున వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. శనివారం ఈ మహాక్రతవు ప్రారంభం కానుంది. మొదటిదశలో జిల్లా వ్యాప్తంగా 90 మందికి వ్యాక్సినేషన్‌ చేసిన తరువాత దాని ఫలితాన్ని పరిగణలోకి తీసుకొని రెండో దశలో ఈ నెల 18 నుంచి చేపట్టబోతున్నారు. రెండోదశలో పారిశుధ్యసిబ్బంది, పోలీసులు, రెవెన్యూసిబ్బందితో పాటు ఇతర ప్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాలు వేయనున్నారు. ఆ తరువాత ఇక 50 సంవత్సరాలలోపు వారందరికీ వరుసపెట్టి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కాగా జిల్లాలోని మూడు కేంద్రాల్లో చేపట్టబోతున్న వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాకలెక్టర్‌ నేతృత్వంలో ఇప్పటికే పలుసార్లు దీనిపై సమీక్ష సమావేశాలు కూడా జరిగాయి. కలెక్టర్‌ సారథ్యంలో చేపట్టబోతున్న వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఎలాంటి అపోహాలు తలెత్తకుండా కూడా వారికి అవగాహన కల్పించబోతున్నారు. ఏదైనా దుష్ప్రరిణామాలు ఏర్పడితే అక్కడికక్కడే ఉన్నతస్థాయి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేపట్టారు. దీని కోసం స్పెషలిస్టు వైద్యులను మూడు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించి వారందరి సహకారం తీసుకునే విషయంపై అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా అంద రిని గడగడలాడించిన కరోనా రక్కసిపై చేపట్టబోతున్న యుద్దం శనివారం మొదలవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇటువైపే కేంద్రీకృతమవుతోంది. 

జిల్లాలో 90 మంది కోసం 

మూడు కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఎంపిక చేసిన 90 మంది వైద్య, ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా ఇచ్చేం దుకు అధికారులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ఆసుపత్రితో పాటు రాంనగర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ అలాగే భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కోకేంద్రంలో 30 మంది చొప్పున వైద్యసిబ్బందికి కరోనాటీకాలు వేయనున్నారు. అయి తే ఈ మూడు కేంద్రాలకు ఇప్పటికే కరోనావ్యాక్సిన్‌లు చేరుకున్నాయి. గత రెండురోజుల నుంచి వీటిని అన్ని రకాల ముందుజాగ్రత్తలతో భద్రపర్చారు. ఈ వ్యాక్సినేషన్‌ మొట్ట మొదటిసారి అందివ్వబోతున్న నేపథ్యంలో వైద్య సిబ్బందితో పాటు సాధారణ జనంలో కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 90 మందికి విజయవంతంగా వ్యాక్సినేషన్‌ చేసిన తరువాత వారికి ఎలాంటి దుష్ప్రరిణామాలు ఎదు రుకానట్లయితే ఈ వ్యాక్సినేషన్‌ విజయవంతమైనట్లే అంటున్నారు. సైడ్‌ ఎఫెక్ట్‌లు తలెత్తకపోతే ఇక రెండోదశను వైద్య సిబ్బంది ఉత్సాహంగా చేపట్టే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోవడం కూడా ఈ వ్యాక్సినేషన్‌ సక్సెస్‌పై ఆధారపడి ఉంటుందంటున్నారు. 

18 నుంచి రెండోదశ

ఈ నెల 18వ తేదీ నుంచి రెండవదశ వ్యాక్సినేషన్‌ను చేపట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. శనివారం చేపట్టే వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ కాగానే మరుసటిరోజు అదే ఊపుతో రెండోదశ వ్యాక్సినేషన్‌ను పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూశాఖతో పాటు ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ చేపట్టనున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మొదటి రెండవదశలు అత్యంత కీలకం కావడంతో అధికార యంత్రాంగమంతా ఇటువైపు దృష్టి సారిస్తోంది. ఎలాగైనా ఈ మహాక్రతువును విజయవంతం చేసి కరోనా రక్కసిని తుదముట్టించాలన్నదే యంత్రాంగం ఉమ్మ డి లక్ష్యంగా కనిపిస్తోంది. అధికారులంతా కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో సమన్వయంగా వ్యవహరిస్తుండడం ప్రాఽ దాన్యతను సంతరించుకుంటోంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీశాఖలు ఉమ్మడిగా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ కోసం శ్రమిస్తుండడం గమనార్హం. 

అంతా కలెక్టర్‌ స్వీయ పర్యవేక్షణలో..

కరోనావ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రభుత్వం షెడ్యూల్‌ను రూపొందించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సంబంధిత యంత్రాంగాన్ని మొదటి నుంచి అప్రమత్తం చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్‌ విషయంపై సమీ క్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఈ సమావేశాల్లో పంచాయతీ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులను బాగస్వాములను చేస్తున్నారు. మొదట వ్యాక్సినేషన్‌ కేంద్రా ల ఎంపికపై కలెక్టర్‌ తీవ్రంగా కసరత్తు జరిపారు. కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రధానమైన జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ రాం నగర్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఈ రెండు చోట్ల వ్యాక్సిన్‌లను భద్రపర్చడమే కాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఆయన సంబంధిత సిబ్బందితో పలు దఫాలుగా రిహాల్సల్స్‌ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారిని ఆసుపత్రిలోకి ఎలాలోనికి ఆహ్వానించాలనే ఆంశం నుంచి మొదలుకొని వ్యాక్సినేషన్‌ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిని ఇంటికి పంపించడం లాంటి వ్యవహారాలన్ని వైద్య, ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్‌, రెవె న్యూ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణ నుంచి మొదలుకొని టీకాలు వేయడం, టీకాలు తీసుకునే వారిని ఎంపిక చేయడం, ప్రజల్లో అపోహలను తొలగించడం లాంటి వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకబృందాలను కూడా నియమించారు. ఈ బృందాల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నారు. అ లాగే వ్యాక్సినేషన్‌కు సంబందించి రిపోర్టులను ఎప్పటికప్పు డు అన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు మొదటి దశ వ్యాక్సినేషన్‌ చేపట్టబోతున్నందున కలెక్టర్‌ల పనితీరు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లా కలెక్టర్‌ తనదైన రీతిలో ఏర్పాట్లతో పాటు ప్రజలకు దీనిపై అవగాహన పెంపొందించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు. 

కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

శనివారం రోజు నుంచి చేపట్టే మొదటి దశ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. జిల్లా ఆసుపత్రితో పాటు రాంనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, భైంసా ఏరియా ఆసుపత్రిలో 30 మందికి చొప్పున వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నాం. 

- ధన్‌రాజ్‌, డీఎంహెచ్‌వో, నిర్మల్‌ 

Updated Date - 2021-01-16T06:50:37+05:30 IST