టీకాకు వేళాయె

ABN , First Publish Date - 2021-01-16T04:09:38+05:30 IST

కొవిడ్‌ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం పదిన్నర గంటలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలి రోజు రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా ఆస్పత్రితోపాటు, నస్పూర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ వేయనున్నారు. ఒక్కో ఆసుపత్రిలో 30 మందిని వ్యాక్సినేషన్‌కు ఎంపిక చేశారు.

టీకాకు వేళాయె
వాయల్‌ను ప్రదర్శిస్తున్న డీఎంహెచ్‌ఓ, వ్యాక్సినేషన్‌ అధికారి ఫయాజ్‌ఖాన్‌

జిల్లాకు చేరిన వాయల్‌ బాక్సులు

రెండు కేంద్రాలు ఎంపిక

నేడు 60 మందికి వ్యాక్సిన్‌

కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నెంబర్‌  ఏర్పాటు 


మంచిర్యాల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.   శనివారం ఉదయం పదిన్నర గంటలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలి రోజు రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా ఆస్పత్రితోపాటు, నస్పూర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ వేయనున్నారు. ఒక్కో ఆసుపత్రిలో 30 మందిని వ్యాక్సినేషన్‌కు ఎంపిక చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా వన్‌ -వే కమ్యూనికేషన్‌ పద్ధతిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. 


తొలి దశ వ్యాక్సినేషన్‌ వీరికి...

తొలి దశ వ్యాక్సినేషన్‌ను ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ సిబ్బందికి ఇవ్వనున్నారు. ఆరోగ్యశాఖకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 2,213 మందితోపాటు ప్రైవేటు సిబ్బంది 183కి వేయనుండగా, జిల్లా వ్యాప్తంగా 1,750 అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాలతోపాటు 435 మంది మినిస్ట్రీ ఆఫ్‌ హోం అఫైర్స్‌లో పని చేస్తున్న సిబ్బందికి టీకా వేయనున్నారు. వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారికి ఏమైన దుష్ఫలితాలు, ఇతరులు సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు వీలుగా కలెక్టరేట్‌లో 08736-250501 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 

జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలు ఏర్పాటు...

శనివారం 60 మందికి టీకా ఇవ్వడం ద్వారా కార్యక్రమం ప్రారంభం కానుండగా అనంతరం ఈ నెల 18, 19, 21, 22 తేదీల్లో కొనసాగనుంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలను ఎంపిక చేశారు.  ఈ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. కొవిన్‌ యాప్‌లో నమోదైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు.  రెండో దశలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, మూడో దశలో 50 ఏళ్ల పైబడ్డవారు, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లలోపు ఉన్నవారికి టీకా వేయ నున్నారు. మొదటి విడుత పూర్తయిన వారికి 28 రోజుల తరువాత రెండో సారి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.


జిల్లాకు చేరుకున్న వ్యాక్సిన్‌...

హైద్రాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో గురువారం ఉదయం జిల్లాకు కేటాయించిన సుమారు 700 డోసులు ఇక్కడికి చేరుకోగా జిల్లా ఆసుపత్రిలో భద్రపరిచారు.   వ్యాక్సిన్‌ పక్కదారి పట్టకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌కు సూర్యరశ్మి తగులకుండా కోల్డ్‌ చైన్‌ మెయింటన్‌ చేస్తారు. 8 మంది వచ్చిన తరువాత ఒకేసారి టీకా వేస్తారు.


పకడ్బందీగా నిర్వహించాలి 

మంచిర్యాల కలెక్టరేట్‌ : కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించి ఆసుపత్రి పరిసరాలు, వివధ వార్డులు, వ్యాక్సిన్‌ స్టోర్‌రూమ్‌లను పరిశీలించారు.  డీఎంహెచ్‌ఓ నీరజ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌, ఆర్‌ఎంఓ అనిల్‌, కళావతి, ఇంద్రావతి తదితరులు పాల్గొన్నారు. 


వైద్యులు అప్రమత్తంగా ఉండాలి 

కోవిడ్‌ టీకా అందించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌ సూచించారు. శుక్రవారం వైద్యులతో సమావేశాన్ని నిర్వహించారు. టీకా పట్ల జరుగుతున్న అసత్యపు ప్రచారం, వదంతులను నమ్మవద్దని, ఎలాంటి ఇబ్బందులున్నా వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.   డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఫయాజ్‌ ఖాన్‌, అనిల్‌ కుమార్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సబ్‌ యూనిట్‌ అధికారి నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు.... 

నస్పూర్‌, జనవరి 16 : నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ శనివారం పంపిణీకీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరోగ్య కేంద్రంలో పని చేసే వైద్య సిబ్బందికి 30 మందిని ఎంపిక చేసి వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా టీకా పంపిణీ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులకు సూచించారు.  జిల్లా వైద్యాధికారి నీరజా, కొవిడ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ సుబ్బరాయుడు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ఫయాజ్‌ఖాన్‌, వైద్యులు జయప్రకాశ్‌, అఫ్రిన్‌ వైద్య సిబ్బది పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T04:09:38+05:30 IST