ఫిర్యాదులపై సకాలంలో స్పందించండి

ABN , First Publish Date - 2021-04-19T05:38:21+05:30 IST

104 కాల్‌ సెంటర్‌ ద్వారా కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చే విజ్ఞప్తులు, ఫిర్యాదులపై తక్షణం స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రత్యేక అధికారి జె.శ్యామలరావు అధికారులకు సూచించారు.

ఫిర్యాదులపై సకాలంలో స్పందించండి
జీజీహెచ్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ల్యాబ్‌ను పరిశీలిస్తున్న శ్యామలరావు

  • జిల్లా ప్రత్యేకాధికారి శ్యామలరావు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 18: 104 కాల్‌ సెంటర్‌ ద్వారా కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చే విజ్ఞప్తులు, ఫిర్యాదులపై తక్షణం స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రత్యేక అధికారి జె.శ్యామలరావు అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, ఇన్‌చార్జి జేసీ సీహెచ్‌ సత్తిబాబులతో కలిసి కలెక్టరేట్‌లోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు. 104, 108 కాల్‌ సెంటర్ల సేవలు, హోం ఐసోలేషన్‌, హోం క్వారంటైన్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, వ్యాక్సినేషన్‌, సైకలాజికల్‌ హెల్ప్‌ లైన తదితర విభాగాల పనితీరును అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో బాఽధితులకు అందుతున్న వైద్య సేవలను సీసీ టీవీ దృశ్యాల ద్వారా పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ కొవిడ్‌ పరీక్షలు, ఆసుపత్రిలో అడ్మిషన్‌, వ్యాక్సిన్‌కు సంబంధించి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. అత్యంత కచ్చితత్వంతో కంటైన్‌మెంట్‌ జోన్లను నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌, టెస్టింగ్‌ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని ఆశాలు, ఏఎన్‌ఎంలు తరచూ సందర్శిస్తున్నారా లేదా అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రంగా ఉన్నందున వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక కిట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలి కౌన్సెలింగ్‌ ద్వారా బాధితులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సచివాలయ స్థాయిలో ప్రత్యేక యాప్‌లో ప్రైమరీ కాంట్రాక్ట్‌ వివరాల నమోదును కచ్చితంగా, వేగంగా  చేపట్టాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోని ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌ కేర్‌ వర్కర్లకు సోమవారంనిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌లో వ్యాక్సిన్‌ వేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరేశ్వరరావు, డీఐవో సీహెచ్‌ భరతలక్ష్మి, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

జీజీహెచ్‌ (కాకినాడ): కాకినాడ జీజీహెచ్‌లోని వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయోగ్నోస్టిక్స్‌ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్‌)ని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో కలిసి శ్యామలరావు పరిశీలించారు. కొవిడ్‌-19 పరీక్షల నిర్వహణ, శాంపుల్స్‌ సేకరణకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. రోజుకి ఎన్ని శాంపుల్స్‌ వస్తున్నాయి, రిపోర్టు జారీకి పట్టే సమయం, సిబ్బంది వివరాలు, కొవిడ్‌ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను డాక్టర్‌ డీఎస్‌ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీలు లక్ష్మీశ, కీర్తి చేకూరి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:38:21+05:30 IST