తొలి దశలో 30 కోట్ల మందికి టీకా

ABN , First Publish Date - 2020-10-18T07:29:04+05:30 IST

కరోనా టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తోంది.

తొలి దశలో 30 కోట్ల మందికి టీకా

ప్రజారోగ్య సిబ్బంది, ముందు వరుస పోరాట యోధులకు

50 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులున్న 50 ఏళ్లలోపువారికి..

నాలుగు విభాగాలుగా ప్రాధాన్య జాబితా వర్గీకరణ

ఈ నెలాఖరు లేదా నవంబరు తొలి వారానికి సిద్ధం

ఎన్నికల ఏర్పాట్ల తరహాలో టీకా పంపిణీ: మోదీ

వ్యాక్సిన్‌ వచ్చాక పంపిణీ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రజారోగ్య సిబ్బంది, ముందు వరుస పోరాట యోధులకు.. 50 ఏళ్లు పైబడిన వారికి..

4 విభాగాలుగా ప్రాధాన్య జాబితా వర్గీకరణ


న్యూఢిల్లీ, అక్టోబరు 17: కరోనా టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తోంది. టీకా పంపిణీకి సంబంధించి నీతీ ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తొలుత ఎవరికి ఇవ్వాలనే అంశమై ముసాయిదా రూపొందిస్తోంది. ఈ బృందానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సహ చైర్మన్‌. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి.. సమాన స్థాయి పంపిణీ, అవసరాల ఆధారంగా కార్యాచరణ తయారు చేస్తోంది.


ఇందులో భాగంగా వైరస్‌ ముప్పు ఎక్కువ ఉన్నవారిని 4 విభాగాలుగా వర్గీకరించింది. ఈ ప్రకారం ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులున్న 30 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందనుంది. 60 కోట్ల డోస్‌లను ఒక్కొక్కరికి రెండు డోస్‌ల (సాధారణ, బూస్టర్‌) చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే ప్రక్రియ సాగుతోందని.. నెలాఖరు లేదా నవంబరు తొలి రోజుల నాటికి పూర్తవుతుందని కమిటీ సభ్యుడొకరు తెలిపారు.


కాగా, దేశ జనాభాలో 23 శాతం మందికి తొలి విడతలో టీకా దక్కనుంది. వీరిలో 50 ఏళ్లు పైబడినవారు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ తదితర (కొమార్బిడిటీస్‌) వ్యాధులున్న 50 ఏళ్లలోపువారే 26 కోట్ల మంది వరకు ఉన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం మూడు టీకాలు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి.

వీటిలో అన్నిటికంటే ముందుగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా, పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా టీకాలు మూడో దశ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. వీటి సమాచారం నవంబరు చివరికి లేదా డిసెంబరు మొదటి వారానికి అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.



ప్రాధాన్య జాబితా ఇది..

1) ప్రభుత్వ, ప్రైవేటు రంగలోని వైద్య, ఆరోగ్య రంగ సిబ్బంది

2) ముందువరుస పోరాట యోధులు

3) 50 ఏళ్ల వయసు పైబడినవారు..

4)ఇతర వ్యాధులున్న 50 ఏళ్లలోపువారు




అందరికీ సత్వరమే టీకా: మోదీ


దేశంలోని ప్రజలందరికీ సత్వరమే టీకా అందేలా సర్వసన్నద్ధంగా ఉండాలని.. ఎన్నికల నిర్వహణ, విపత్తుల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజం ఏ స్థాయిలో అయితే మమేకమై పనిచేస్తుందో అదే స్థాయిలో టీకా పంపిణీ వ్యవస్థ ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితి, టీకా పంపిణీ సన్నద్ధతపై శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, ప్రధాని కార్యదర్శి, నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. టీకా పంపిణీ సందర్భంగా భారత దేశ భౌగోళిక స్వరూపం, వైవిధ్యతను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని సూచించారు. 


లక్ష ఫ్రిజ్‌లు కావాలి..


శీతలీకరణ వ్యవస్థ నిర్దిష్టంగా లేని భారత్‌లో వివిధ టీకాలను భిన్న ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం సవాల్‌ కానుంది. ఒక అంచనా ప్రకారం టీకా నిల్వకు లక్ష ఫ్రిజ్‌లు, 11 వేల రిఫ్రిజిరేటెడ్‌ ట్రక్‌లు అవసరం.

మరోవైపు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశిత ఫార్మా ప్రమాణాలున్న సంస్థలు భారత్‌లో చాలా తక్కువగా ఉన్నాయి.


Updated Date - 2020-10-18T07:29:04+05:30 IST