నేటి నుంచి ఆసుపత్రుల్లో టీకా

ABN , First Publish Date - 2021-03-01T05:14:45+05:30 IST

జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచసీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు కలిపి మొత్తం 23 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45 సంవత్సరాల నుంచి 50 మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులైన షుగరు, హైపర్‌టెన్షన తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొవిడ్‌ టీకా అందిస్తారు

నేటి నుంచి ఆసుపత్రుల్లో టీకా

ఒక్కో డోస్‌ రూ.250

తొలి విడతలో 7 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో అమలు

ఏడు ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా

23 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం

60 ఏళ్లు నిండిన వారు.. 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా

ఆరు లక్షల టీకా అవసరం


కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు తయారైన వ్యాక్సిన సోమవారం నుంచి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి రానుంది. మహమ్మారి సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందరికీ టీకా అందుబాటులోకి రావడం శుభవార్తే. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని 7 ప్రభుత్వ ఆసుపత్రుల  ద్వారా టీకా పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో ఒక్కో టీకా ఖరీదు రూ.150, సర్వీసు ఛార్జి రూ.100 కలిపి మొత్తం రూ.250 వసూలు చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే అందిస్తారు. 


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచసీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు కలిపి మొత్తం 23 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45 సంవత్సరాల నుంచి 50 మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులైన షుగరు, హైపర్‌టెన్షన తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొవిడ్‌ టీకా అందిస్తారు. తక్షణమే కడపలో నాలుగు ప్రైవేటు ఆసుపత్రుల్లో, ప్రొద్దుటూరులో 3 ప్రైవేటు ఆసుపత్రిలో టీకా పంపిణీ అందుబాటులోకి రానుంది. ఆదివారం రాత్రి జిల్లా వైద్య అధికారి అనిల్‌కుమార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల  డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి టీకా పంపిణీపై చర్చించారు. టీకా తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రియాక్షన కలిగితే చేపట్టాల్సిన వైద్యంపై చర్చించారు. 


6 లక్షల డోస్‌లు అవసరం

జిల్లాలో మొదటి విడతలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన వర్కర్లకు దాదాపు 21,500 వరకు టీకాలు వేశారు. వీరికి రెండో డోస్‌ కూడా ఇస్తున్నారు. ఇక రెండో విడతలో పోలీసులు ఇతర అధికారులకు వ్యాక్సినేషన జరిగింది. మూడో విడత కూడా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఆరు లక్షల టీకాలు అవసరమవుతాయని వైద్యశాఖ అంచనా వేసింది. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 60 వేల డోస్‌లు సిద్ధంగా ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటించింది. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులకు 36 వేల డోస్‌లను తరలించారు. మూడో విడత పంపిణీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొదటి వారంలో ఒక్కో సెంటరు నుంచి వంద మందికి టీకా వేసేలా ప్రణాళికలు రూపొందించారు.


60 ఏళ్లు పైబడ్డ వారికి

60 ఏళ్లు నిండిన వారు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న ఆసుపత్రుల మ్యాపింగ్‌ చేస్తున్నారు. టీకా కేంద్రాల వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోవిన 2.0 యాప్‌లో ఉంటాయి. ఈ యాప్‌లో అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పైబడ్డ వారు పుట్టిన తేదీని ధృవీకరించే ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, వైద్యుడు ఇచ్చిన ధృవపత్రం ద్వారా టీకా వేయించుకోవచ్చు. ముందస్తుగా టీకా కోసం రిజిస్ట్రేషన చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వారు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌ల వద్ద స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఏ తేదీ, ఎన్ని గంటలకు రావాలనేది అందులో మెసేజ్‌ వస్తుంది. 45 ఏళ్లు పైబడ్డ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ వైద్యుల నుంచి ఏ జబ్బుతో బాధపడుతున్నారో సర్టిఫికెట్‌ పొందాలి. 


టీకా రిజిస్ట్రేషన వివరాలు

కొవిడ్‌ వ్యాక్సిన కోసం మొబైల్‌లోనే నమోదు చేసుకోవచ్చు. కొవిడ్‌ యాప్‌, ఆరోగ్యశ్రీ యాప్‌ ద్వారా లాగిన కావచ్చు. ఛిౌఠీజీుఽ.జౌఠి.జీుఽలో లాగిన అవ్వాలి. వెంటనే మొబైల్‌ నెంబరు నమోదు చేయాలి. ఓటీపీ ఎంటర్‌ చేయాలి. పేరు, వయసు, ఆధార్‌ కార్డు నిర్ధారణకు అప్‌లోడ్‌ చేయాలి. 40 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులు డాక్టరు సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. ఒక మొబైల్‌ నెంబరు ద్వారా నలుగురు రిజిస్టరు చేసుకోవచ్చు. 


ప్రభుత్వాసుపత్రుల వివరాలు

కడపలోని రిమ్స్‌, అక్కాయపల్లె పీహెచసీ, చిన్నమండెం, చిట్వేలి, దువ్వూరు, కలసపాడు, ముద్దనూరు, మైలవరం, పుల్లంపేట, రామాపురం, వీరబల్లి, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందుల ఏరియా ఆసుపత్రి, రాయచోటి సీహెచసీ, రాజంపేట, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, చెన్నూరు, రైల్వేకోడూరు, సిద్దవటం, పోరుమామిళ్ల, వేంపల్లె ప్రభుత్వాసుపత్రుల్లో టీకా వేయనున్నారు.


ప్రైవేట్‌ ఆసుపత్రులు

కడపలో హిమాలయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కొమ్మా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీశ్రీ హోలిస్టిక్‌ ఆసుపత్రి, ఎంఎం ఆసుపత్రి, ప్రొద్దుటూరులోని లతా నర్సింగ్‌ హోం, తేజ ఆసుపత్రి, పావని ఆసుపత్రులలో టీకా వేయనున్నారు. 


ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితం

- అనిల్‌కుమార్‌, డీఎంహెచవో, కడప.

జిల్లాలోని 23 ప్రభుత్వాసుపత్రులలో 60 ఏళ్లు పైబడిన వారు, 45 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కొవిడ్‌ టీకా అందిస్తాం. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా కోసం 150 రూపాయలు, సర్వీస్‌ చార్జీ 100 రూపాయలు కలిపి 250 రూపాయలు వసూలు చేస్తారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు టీకా మాత్రమే అందిస్తామన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక ఖాతాలో ప్రైవేట్‌ ఆసుపత్రులు టీకా కోసం డబ్బులు జమ చేయాలి. 

Updated Date - 2021-03-01T05:14:45+05:30 IST