18-45 ఏళ్లవారికి వ్యాక్సినేషన్‌ జూన్‌లోనే?

ABN , First Publish Date - 2021-05-06T07:57:43+05:30 IST

రాష్ట్రంలోని 18-45 ఏళ్లలోపు వారికి ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు.

18-45 ఏళ్లవారికి వ్యాక్సినేషన్‌ జూన్‌లోనే?

  • కేంద్రం పంపిస్తున్న డోసులు సరిపోవంటున్న రాష్ట్రం
  • ఈ వయసు వారు 1.70 కోట్ల మంది
  • అవసరమైన డోసులు 3.40 కోట్లు 
  • మూడోదశలో కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది 3.9 లక్షల డోసులే
  • టీకాల పంపిణీపై.. ప్రధానితో 
  • మాట్లాడనున్న సీఎం ? 
  • వేగం తగ్గిన వ్యాక్సినేషన్‌
  • కొవిన్‌ పోర్టల్‌లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ నిబంధన ప్రభావం
  • మరో 47,481 మందికి తొలి డోసు


హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 18-45 ఏళ్లలోపు వారికి ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. వీరంతా జూన్‌ వరకు ఆగాల్సిందే. కనీసం అప్పటికైనా తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ వస్తేనే.. ఆ వయోవర్గాల వారికి టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డోసులు ఏ మూలకూ సరిపోవని, సరిపడా డోసులు పంపించాలని కోరుతున్నా స్పందన లేదని వైద్యఆరోగ్యశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని 100 శాతం మందికి ఉచితంగా టీకాలు వేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పట్లో నెరవేరుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 


మొదటి దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేశారు. రెండో దశ కింద 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికే వ్యాక్సిన్లు వేస్తున్నారు. మూడోదశ కింద 18-45 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో ప్రారంభం కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తగినన్ని డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందడం లేదని, ఈ దృష్ట్యా జూన్‌లోనే మూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వెల్లడించారు. 


స్పుత్నిక్‌-విపై ఆశలు.. 

రాష్ట్రంలో 18-45 ఏళ్లలోపు వారు 1.70 కోట్ల మంది ఉన్నారు. వీరికి రెండు డోసులు చొప్పున వ్యాక్సిన్‌ను వేయాలంటే మొత్తం 3.40 కోట్ల డోసులు అవసరం. అంటే రోజుకు 30-40 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్‌ను వేయాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3.9 లక్షల డోసులను మాత్రమే పంపించిందని సీఎస్‌ సోమేశ్‌ తెలిపారు. ఇందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడో దశ టీకా కార్యక్రమాన్ని అబయెన్స్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అంటే జూన్‌ వరకు మూడో దశ వ్యాక్సినేషన్‌ అబయెన్స్‌లోనే ఉండే అవకాశం ఉంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే డోసుల లభ్యత మరింత పెరగొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీకా తయారీ కంపెనీలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 


హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ను తయారు చేస్తోంది. రాష్ట్రంలోనే టీకా ఉత్పత్తి జరుగుతున్నా.. ఇక్కడి ప్రజలకు అందించలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. టీకా డోసుల పంపిణీ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉండడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఈవిషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతారని సీఎస్‌ సోమేశ్‌ పేర్కొన్నారు. అప్పటికైనా రాష్ట్రానికి టీకా డోసుల సరఫరా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ డోసులు ఎక్కువ మొత్తంలో వస్తే... జూన్‌లో మూడో దశ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నట్లు ఆయన వివరించారు. 


పోర్టల్‌లో నమోదుపై అవగాహన లేక 

రాష్ట్రంలో మే 1 నుంచి వ్యాక్సినేషన్‌ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ ఇస్తుండటం,  రిజిస్ట్రేషన్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఏప్రిల్‌ చివరివారంలో రోజుకు 2 లక్షల మంది టీకా తీసుకున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో గత మూడు రోజులుగా ప్రతిరోజూ లక్షలోపే టీకాలు వేస్తున్నారు. మంగళవారం 946 ప్రభుత్వ కేంద్రాల్లో 47,481 మంది తొలిడోసు తీసుకోవడంతో, ఇప్పటివరకు ఈ డోసు తీసుకున్న వారి సంఖ్య 42,24,880కు పెరిగింది. మరో 18070 మంది రెండో డోసు తీసుకోగా, ఈవిభాగంలోని లబ్ధిదారుల సంఖ్య 6,55,455కు చేరింది. మంగళవారం కూడా ఒక్క ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకాలు ఇవ్వలేదని వ్యాక్సిన్‌ బులిటెన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Updated Date - 2021-05-06T07:57:43+05:30 IST