పదో విడత Vaccination ‌driveకు అపూర్వ స్పందన

ABN , First Publish Date - 2021-11-22T17:01:59+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పదో విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రమంత టా 50 వేల కేంద్రాల్లో కొవాగ్జిన్‌, కొవిషీల్ట్‌ టీకాలు వేశారు. చెన్నైలో వార్డుకు పది శిబిరాల చొప్పున రెండు వందల

పదో విడత Vaccination ‌driveకు అపూర్వ స్పందన

50వేల కేంద్రాల్లో టీకాలు 

బారులు తీరిన జనం


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పదో విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రమంత టా 50 వేల కేంద్రాల్లో కొవాగ్జిన్‌, కొవిషీల్ట్‌ టీకాలు వేశారు.  చెన్నైలో వార్డుకు పది శిబిరాల చొప్పున రెండు వందల వార్డులలో రెండు వేల శిబిరాలు నిర్వహించి నగరవాసు లకు మొదటి విడత, రెండో విడత కరోనా నిరోధక టీకాలు వేశారు. ఆదివారం ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఈ శిబిరాల వద్ద టీకాలు వేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ శిబిరాల్లో మొదటి డోసు, సెకెండ్‌ డోసు టీకాలు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ శిబిరాల వద్దకు మొదటి డోసు టీకాలు వేసుకున్నవారు సెకెండ్‌ డోసు టీకాలు వేసుకునేందుకు ఇంకా గడువుండగానే టీకాలు వేసుకునేందుకు రావటం కలకలం సృష్టించింది. గడువుకు ముందే టీకాలు వేస్తే తమ ఉద్యోగాలు పోతాయని శిబిరాల వద్దనున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు నచ్చజెప్పేందుకు తంటాలు పడ్డారు. నగరంలో టి.నగర్‌, రాయపేట, రాయపురం, మైలాపూరు, వేళచ్చేరి, కోడంబాక్కం, విరుగంబాక్కం, వాషర్‌మెన్‌పేట, అడయార్‌. మందవెల్లి, ట్రిప్లికేన్‌, చేపాక్‌, ప్యారీస్‌ కార్నర్‌ తదితర ప్రాంతాల్లో సినిమాథియేటర్ల సమీపంలో, బస్టాపులు, బస్‌స్టాండుల వద్ద ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతిచోటా ప్రతి శిబిరం వద్ద ఆదివారం ఉదయమే ప్రజలు టీకాలు వేసుకునేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. ఈ శిబిరాలకు సెకెండ్‌ డోసు టీకాలు వేసుకునేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.  స్థానిక తిరువొత్తియూరు జోన్‌ తాళంకుప్పం కార్పొరేషన్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన టీకాల శిబిరాన్ని ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జే రాధాకృష్ణన్‌, శాసనసభ్యులు ఎస్‌ సుదర్శనం, కేపీ శంకర్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ పరిశీలించారు.


టీకాల కొరత లేదు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ శిబిరాలను వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం టీకాల కొరతలేదని, సుమారు కోటి డోసుల మేరకు టీకాలు స్టాకు ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. తిరువొత్తియూరు వద్ద ఆయన టీకాల శిబిరాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన అమ్మా క్లినిక్‌లలో పనిచేయడానికి డాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఏ చోటా నర్సులను నియమించలేదని ఆయన ఆరోపించారు. రెండు వేల అమ్మా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించుకున్నా, వాస్తవానికి ఐదు వందల అమ్మా క్లినిక్‌లు అరకొర సిబ్బందితో పనిచేస్తున్నాయని తెలిపారు. నగరంలో పదో విడత మెగా శిబిరంలో సుమారు రెండు లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 80 శాతం మంది మొదటి డోసు టీకాలు వేసుకున్నారని, 30 శాతం మంది రెండో డోసు టీకాలు వేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం సెకెండ్‌ డోసు వేసుకోవాల్సినవారిని ఆరోగ్య కార్యకర్తలు టీకాల శిబిరాల వద్దకు తరలిస్తున్నారని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-11-22T17:01:59+05:30 IST