62.4 శాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-02-25T05:59:08+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగాల హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి విడత టీకాను ఇస్తున్నారు.

62.4 శాతం వ్యాక్సినేషన్‌

  1. నేటితో మొదటి విడత గడువు పూర్తి
  2. ప్రైవేటు ఆసుపత్రుల్లో 35 శాతమే


కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 24: కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగాల హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి విడత టీకాను ఇస్తున్నారు. ఈ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. గురువారంతో ముగు స్తుంది. 39 రోజులు గడిచినా 62 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. కొవిడ్‌ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నా, చాలా మంది ముందుకు రావడం లేదు. జిల్లాలో హెల్త్‌కేర్‌ వర్కర్లు మొత్తం 27,409 మంది కొవిడ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 17,104 మంది (62.40 శాతం) మాత్రమే టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకోని మిగిలిన 38 శాతం మందిలో 16 శాతం గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉన్నారు. 22 శాతం మంది టీకా తీసుకోవడానికి నిరాకరించారు.  


జీజీహెచ్‌లో 63 శాతం

కొవిడ్‌ నివారణలో కీలక భూమిక పోషించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. కొందరు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది, అలర్జీ పేరుతో  టీకాకు దూరంగా ఉన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ముందుకు రావడం లేదు. కర్నూలు జీజీహెచ్‌లో 1,843 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు ఉండగా, 1,159 మంది (63 శాతం) టీకా వేసుకున్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో 2,737 మందికి గానూ 1,559 మంది (57 శాతం) టీకా తీసుకున్నారు. 


డీఎంహెచ్‌వో ఆఫీసులో 35 మంది

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 80 మంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 35 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో ఆఫీసు, టీబీ, పీవోడీటీటీ, ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలో 60 శాతం మంది టీకా వేయించుకున్నారు. 


ప్రైవేటు ఆసుపత్రుల్లో 35 శాతం

ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిలో 35 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నాయి.  52 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో 3,734 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లుకు గాను 1,790 మంది (48.8 శాతం) టీకా వేయించుకున్నారు. డెంటల్‌ ఆసుపత్రుల్లో 80  మందికి గాను 50 మంది టీకా వేయించుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 1898 మంది వైద్య సిబ్బంది ఉండగా, 666 మంది టీకా వేయించుకున్నారు. జిల్లాలో పది నర్సింగ్‌ కాలేజీలలో 1,050 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 710 మంది (67 శాతం) టీకా వేయించుకున్నారు. శాంతిరాం మెడికల్‌ కాలేజ్‌లో 1,215 మందికి గానూ 301 మంది (25 శాతం), విశ్వభారతి మెడికల్‌ కాలేజీలో 356 మందికిగాను 139 (39 శాతం)మంది టీకా వేయించుకున్నారు.


పీహెచ్‌సీల్లో 87 శాతం

జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్‌కేర్‌ వర్కర్లు 81 శాతం,  సీహెచ్‌సీలో 83 శాతం టీకా వేయించుకున్నారు. కర్నూలు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో 91 మందికి గాను 90 మంది టీకా వేయించుకున్నారు. 108 విభాగంలో 180 మందికి గాను 153 మంది, 104లో 117 మందికి గాను 97 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 


రెండు కరోనా కేసులు

జిల్లాలో గత 24 గంటల్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60,862కు చేరింది. 15 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,358 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 


1,448 మందికి టీకా

బుధవారం 9,199 మందికి గాను 1,448 మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు. జిల్లాలోని 87 ఆరోగ్య కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. 

Updated Date - 2021-02-25T05:59:08+05:30 IST