టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడ్డ భారత వ్యక్తి.. సింగపూర్‌లో..

ABN , First Publish Date - 2021-04-13T14:31:31+05:30 IST

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా భారత వ్యక్తి కరోనా బారిన పడ్డ ఘటన సింగపూర్‌లో జరిగింది.

టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడ్డ భారత వ్యక్తి.. సింగపూర్‌లో..

సింగపూర్ సిటీ: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా భారత వ్యక్తి కరోనా బారిన పడ్డ ఘటన సింగపూర్‌లో జరిగింది. ఆదివారం సింగపూర్‌లో బయటపడిన 20 కరోనా కేసుల్లో 23 ఏళ్ల భారత వ్యక్తి కూడా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. లాషింగ్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న భారత వ్యక్తికి ఏప్రిల్ 7న నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. దాంతో భారతీయుడిని వెంటనే ఐసోలేషన్‌కు పంపించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేయగా అప్పుడు కూడా పాజిటివ్‌గానే వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దాంతో భారత వ్యక్తిని అంటు వ్యాధుల జాతీయ కేంద్రానికి తరలించారు. కాగా, ఫిబ్రవరి 28న కార్మికుల వసతిగృహంలో ఓ భారత వర్కర్‌కు వైరస్ సోకగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కనుక కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నా మీకు ఇన్ఫెక్షన్‌ సోకదని అనుకుంటే తప్పులో కాలేసినట్టేనని, టీకా తీసుకున్న తర్వాత కూడా.. మాస్క్‌ ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలను పాటించకుంటే ఇన్ఫెక్షన్‌ సోకే ముప్పు పొంచి ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు జనాలను హెచ్చరించారు. ఇదిలాఉంటే.. సింగపూర్‌లో ఇప్పటి వరకు 60,678 మంది కరోనా బారిన పడగా.. ఇందులో 30 మంది మృతిచెందారు.  

Updated Date - 2021-04-13T14:31:31+05:30 IST