ఊరొదిలి వెళ్తున్నారు

ABN , First Publish Date - 2021-04-11T05:14:39+05:30 IST

గోరుకల్లులో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలకు భయపడి గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు

ఊరొదిలి వెళ్తున్నారు
ఖాళీగా దర్శనమిస్తున్న ఇల్లు

  • గోరుకల్లులో ఇళ్లకు తాళాలు
  • అతిసార భయంతో గ్రామం ఖాళీ


పాణ్యం, ఏప్రిల్‌ 10: గోరుకల్లులో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలకు భయపడి గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటికి దాదాపు 30 కుటుంబాలు ఇళ్లను వదలి వెళ్లాయి. గ్రామంలో అతిసార తగ్గుముఖం పడుతున్నా స్థానికుల్లో భయాందోళనలు తొలగిపోవడం లేదు. దీనికితోడు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి రావచ్చనే అభిప్రాయంతో చాలా మంది ఊరు వదిలి వెళుతున్నారు. గోరుకల్లువాసులు పలువురు నంద్యాల, రుద్రవరం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. రిజర్వాయర్‌లో భూములు కోల్పోవడంతో కూలీలుగా మారిన కొందరు రైతులు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివారు ప్రాంతాలకు వలస వెళుతున్నారు. 


రిజర్వాయర్‌ పక్కనే ఉన్నా..

గోరుకల్లు గ్రామానికి పక్కనే రిజర్వాయర్‌ ఉంది. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. అయినా ఆ ఊరి జనం గొంతు తడవడం లేదు. గ్రామంలోని నీరు ప్రజలు వినియోగించడం లేదు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. కానీ ఊరి జనాభా 2,779 మందికి ఆ నీరు సరిపోవడంలేదని అంటున్నారు. గ్రామంలో ప్రస్తుతం తాగునీటికి ఒకటి, వాడుకోవడానికి రెండు ట్యాంకర్ల నీటిని తెప్పిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంటున్నారు. పశు పోషణ కోసం వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. 


అతిసార తగ్గుముఖం..

గోరుకల్లులో డయేరియా తగ్గుముఖం పట్టిందని తహసీల్దారు రత్నరాధిక తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోందని, శనివారం కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి గ్రామంలో వైద్యం అందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు గ్రామంలో ఆరుగురు వైద్యులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. శిబిరంలో  ఆరుగురు స్పెషలిస్టులు, పది మంది డ్యూటీ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో వైద్యుల సిఫార్సు లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య ఖర్చులు అందవని తహసీల్దారు తెలిపారు. అత్యవసర బాధితుల కోసం ప్రత్యేకంగా 108 వాహనాన్ని ఏర్పాటు చేసి కర్నూలుకు తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కోలుకున్నవారు ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించారు. వైద్య బృందంతో పాటు ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఈవోఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయయ సిబ్బంది, వలంటీర్లు గ్రామంలో  సేవలు అందిస్తున్నారని తహసీల్దారు తెలిపారు. 

Updated Date - 2021-04-11T05:14:39+05:30 IST