వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ!

ABN , First Publish Date - 2020-06-05T10:03:04+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ..

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ!

వారంలో నోటిఫికేషన్‌

9,700 మంది సిబ్బంది నియామకానికి చర్యలు

రాష్ట్రంలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు

శ్రీకాకుళం జీజీహెచ్‌లో సౌకర్యాలు మెరుగుపడాలి

డిప్యూటీ సీఎం, మంత్రి ఆళ్ల నాని 


గుజరాతీపేట, జూన్‌ 4: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని) తెలిపారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌) వైద్యాధికారులు, వైద్యులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ‘వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరతను తీర్చేందుకు నియామకాలు చేపట్టనున్నాం. 9,700 మంది సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం. శ్రీకాకుళం జీజీహెచ్‌లో సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది. సీటీఐ, ఎంఆర్‌ఐ స్కాన్‌ యంత్రాలు పని చేయడం లేదనే పరిస్థితి ఉండకూడదు. వీటిని కొత్తగా నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పెట్టాలి’ అని వైద్యాధికారులను ఆదేశించారు.


జీజీహెచ్‌కు సంబంధించి నాడు-నేడు ప్రతిపాదనలు సరిగా లేవని, వెంటనే పూర్తిస్థాయి ప్రతిపాదనలు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.  ‘రాష్ట్రంలో మరో 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నాం. శ్రీకాకుళం జీజీహెచ్‌లో రూ.60కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రూ.16వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తాం.


ఆగస్టులో పనులకు టెండర్లను పిలుస్తాం. కార్పొరేట్‌ స్థాయిలో రోగులకు వైద్య సదుపాయాలు కల్పించాలి. నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలి’ అని మంత్రి నాని ఆదేశించారు. శ్రీకాకుళం వైద్య కళాశాలకు ప్రత్యేక బస్సు కావాలని ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి కోరగా, నిధులు సేకరించి వాహనాన్ని సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. శ్రీకాకుళం వంటి ప్రాంతంలో పని చేయని వారికి పోస్టింగ్‌ ఇచ్చినా ఫలితం ఉండదని, అందుకు ప్రభుత్వం తగు విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. డిప్యూటేషన్‌పై విశాఖలో నియమితులైన నెఫ్రాలజిస్ట్‌ డిప్యూటేషన్‌ను రద్దు చేసినట్లు మంత్రి నాని తెలిపారు. 


 డిప్యూటేషన్‌ల రద్దుపై నిర్ణయం తీసుకోండి 

శ్రీకాకుళం జీజీహెచ్‌లో వైద్యుల డిప్యూటేషన్ల రద్దుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి నానిని మరో మంత్రి కృష్ణదాస్‌ కోరారు. జిల్లా నుంచి పోస్టింగ్‌ తీసుకున్న వారెవరూ బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, జీజీహెచ్‌లో సర్జరీ, ఆర్థో, గైనిక్‌ విభాగాలకు అదనపు యూనిట్లు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నివాస్‌, జేసీ శ్రీనివాసులు, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ వెంకటేశ్వర్లు, రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, ఏపీవీవీపీ  కమిషనర్‌ రామకృష్ణ, ఏపీఎంఐడీసీ పర్యవేక్షక ఇంజినీర్‌ ఉమేష్‌కుమార్‌, డీఎంహెచ్‌వో చెంచయ్య, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:03:04+05:30 IST