వాల్టా ని‘బంధనాల’కు విముక్తి

ABN , First Publish Date - 2021-01-26T06:41:25+05:30 IST

ఉచిత బోరు పథకానికి దూరమైన గ్రామాలకు ఊరటనిచ్చే కబురు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన జలకళ పథకానికి వాల్టా చట్ట నిబంధనలు ప్రతికూలంగా మారిన విషయం తెలిసిందే.

వాల్టా ని‘బంధనాల’కు విముక్తి

అధిక వినియోగ జాబితాలో 123 గ్రామాలు

‘జలకళ’కు సడలించాలన్న  యోచనలో ప్రభుత్వం

నిషేధిత గ్రామాలపై అధ్యయనం చేసేందుకు  త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీ

ఒంగోలు(జడ్పీ), జనవరి 25 : ఉచిత బోరు పథకానికి దూరమైన గ్రామాలకు ఊరటనిచ్చే కబురు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన జలకళ పథకానికి వాల్టా చట్ట నిబంధనలు ప్రతికూలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలో ఉన్నతస్థాయి కమిటీతో ఆయా గ్రామాల్లో విచారణ జరిపించి నిబంధ నల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 2016--17 లో గణించిన భూగర్భజలాల లెక్కల ప్రకారం జిల్లాలో 123గ్రామాలు వాల్టా చట్ట పరిధిలోని ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ (భూగర్భజలాలను అధికంగా వాడుకున్న గ్రామాలు)జాబితాలో చేరాయి. విధిగా ప్రతి రెండేళ్ల కొకసారి భూగర్భజలాలను లెక్కించాల్సి ఉన్నా అది జరగలేదు. ప్రస్తుతం జిల్లాలో సగటున ఆరు మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని ఇటీవలే ఆ శాఖ తేల్చింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో కమిటీని ఏర్పరచి నిషేధిత జాబితాలో ఉన్న గ్రామాలపై నివేదికను కోరనుంది


విధివిధానాలపై కమిటీ అధ్యయనం 

ప్రభుత్వం జిల్లాలో నియమించబోయే కమిటీ వాల్టా చట్టంలోని ఏయే నిబం ధనలు రైతులకు జలకళ పథకం ఫలాలను దూరం చేస్తున్నాయో వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. అనంతరం శాస్త్రీయంగా చట్ట పరిమితులకు లో బడి ఏయే నిబంధనలకు సడలింపులు ఇవ్వొచ్చో ప్రభుత్వానికి నివేదిక అంద చేస్తుంది. దానిని బట్టి ప్రభుత్వం జలకళ పథకం కింద అర్హతకు మరికొన్ని మినహాయింపులు ఇవ్వడంతోపాటు, వాల్టా చట్టానికి కూడా స్వల్ప మార్పులు తీసుకొచ్చే అవకాశ ముంది. వాల్టా నిబంధనల్లోని మరో అంశమైన 200 నుంచి 300 మీటర్ల పరిఽధిలో బోరు ఉంటే మరో బోరు వేయకూడదనే నిబంధన కూడా రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ అంశంపై కూడా కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. జిల్లాలో భూగర్భజలాలను అధికంగా వినియోగించుకున్న జాబితాలో ఎక్కువగాగిద్దలూరు మండలపరిధిలో 16, మార్కాపురం మండలంలో 16, యర్రగొండపాలెంలో 15 గ్రామాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో పెద్దారవీడు మండలంలో 14, బేస్తవారపేట పరిధిలో 10, దోర్నాలలో 8 గ్రామాలకు ప్రస్తుతం జలకళ పథకం వర్తించే అవకాశాలు లేవు. కంభం, దొనకొండ, కొమరోలు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం మండలాలపరిధిలో మిగతా గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వం నియమించబోయే కమిటీ ఈ జాబితాలో ఉన్న గ్రామాల్లోని భూగర్భజలాల లభ్యతపై అనుకూలంగా స్పందించినట్లయితే జలకళ పథకానికి ఆయా గ్రామాల రైతులు కూడా అర్హత సాధించే అవకాశముంది.


Updated Date - 2021-01-26T06:41:25+05:30 IST