వీఏఏలపై వేటు

ABN , First Publish Date - 2022-08-09T06:04:20+05:30 IST

గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై వరకు రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

వీఏఏలపై వేటు

25 మందిని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై చర్యలు

మరికొంత మందిలో మొదలైన వణుకు


రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేస్తే శిక్ష అనుభవించక తప్పదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన గ్రామ వ్యవసాయ సహాయకులపై వేటు (వీఏఏ) పడింది. మొత్తం 25 మందిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికార, ఉద్యోగ వర్గాల్లో ఇది సంచలనంగా మారింది. ఒక వ్యవహారంలో ఇంత మందిపై ఒకేసారి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి అని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. తదుపరి వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.


నెల్లూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై వరకు రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ-క్రాప్‌ నమోదు చేసిన భూముల్లోని పంటనే రైతు భరోసా కేంద్రాల్లో కొనేలా ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. దీనిని పలువురు దళారులు, వైసీపీ నేతలు, మిల్లర్లు అవకాశంగా మలుచుకున్నారు. రైతుకు దక్కాల్సిన మద్దతు ధరను వీఏఏల సహకారంతో వీరు జేబుల్లో వేసుకున్నారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జేసీ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. 


మొదటగా 25 మంది సస్పెన్షన్‌

మొదటి విడతలో రూ.3 లక్షలపైన విక్రయాలు జరిగిన ఎఫ్‌టీవోలపై విచారణ జరిపారు. ఇటువంటి లావాదేవీలు జిల్లాలో 4484 ఉండగా వాటన్నింటినీ జేసీ నుంచి తహసీల్దార్‌ వరకు క్షేత్రస్థాయిలో విచారించారు. అందులో  3914 ఎఫ్‌టీవోలు సవ్యంగా ఉన్నాయని, మిగిలినవే అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించారు. వాటిపై మరింత లోతుగా విచారణ జరిపి 525 ఎఫ్‌టీవోల ద్వారా రూ.34.24 కోట్లు విలువైన ధాన్యాన్ని రైతులు కాకుండా ఇతరులు విక్రయించారని తేల్చారు. భూమి లేకపోయినా ఈ-క్రాప్‌లో ఉన్నట్లు రికార్డు చేయడం, చెరువులు, రోడ్లను కూడా పొలాలుగా రికార్డు చేసి ఆ సర్వే నెంబర్ల మీద ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించారు. అలానే మరో 234 ఎఫ్‌టీవోలకు సంబంధించి రూ.14.6 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లపై పలు రిమార్కులను రాశారు. ఇక్కడ మెజారిటీగా రైతుకు సంబంధం లేకుండా వారిపేరు మీద మరొకరు ధాన్యం విక్రయించారు. ఒకరకంగా ఇది కూడా మోసమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరైతే ఈ భూములకు ఈ-క్రాప్‌ నమోదు చేశారో వారందరినీ గుర్తించారు.  63 మంది వీఏఏలు అవకతవకలకు పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చి ఆ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు జేసీ రోణంకి కూర్మనాథ్‌, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబులకు నివేదించారు. అనుమానాస్పద ఎఫ్‌టీవోలు మినహాయించి పక్కాగా తప్పు చేసినట్లు తేలిన ఎఫ్‌టీవోలపై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే 25 మంది వీఏఏలను సస్పెండ్‌ చేశారు. మిగిలిన వారికి షోకాజు నోటీసులు ఇవ్వగా, వారి వివరణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా రెండో విడతలో రూ.3 లక్షలలోపు ఎఫ్‌టీవోలపై కూడా విచారణ జరపాలని నిర్ణయించుకోవడంతో మరికొంత మంది వీఏఏల్లో వణుకు మొదలైంది. 

Updated Date - 2022-08-09T06:04:20+05:30 IST