విలువైన సాధన

ABN , First Publish Date - 2021-12-10T05:30:00+05:30 IST

ప్రసిద్ధులైన జెన్‌ గురువుల్లో బొకుజు ఒకరు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారికి ఆయన వింత వింత పనులు చెప్పేవాడు.....

విలువైన సాధన

ప్రసిద్ధులైన జెన్‌ గురువుల్లో బొకుజు ఒకరు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారికి ఆయన వింత వింత పనులు చెప్పేవాడు. ఆయన మఠానికి కొంత దూరంలో ఒక నీటి వాగు ఉండేది. ఒక రోజు బొకుజు తన శిష్యులను పిలిచి... ‘‘ఈ రోజు మీరు సాధన చేయాల్సింది ఏమిటంటే... మీరు ఆ వాగు దాటి అటువైపు వెళ్ళాలి. తిరిగి ఇటువైపు రావాలి. కానీ నీరు మిమ్మల్ని తాకకూడదు’’ అని చెప్పాడు.


శిష్యులందరూ ఆ వాగు దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అక్కడ తెప్ప లాంటిది ఏదీ లేదు. వంతెన కూడా లేదు. మరి నీరు తగలకుండా ఎలా దాటాలి? ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ప్రయత్నించారు. చివరకు... నీరు తగలకుండా ఆవలి గట్టుకు వెళ్ళడం, రావడం అసాధ్యమని తెలుసుకున్నారు. ఆ వాగులో ఎక్కడ కాలు పెట్టినా... మోకాలి లోతు నీళ్ళున్నాయి. ‘కాస్త లోతు లేని చోట నడిస్తే పాదాలు మాత్రమే తడవవచ్చేమో! దాన్ని గురువుగారు మన్నించవచ్చేమో!’ అనుకొని అలాంటి ప్రదేశం కోసం వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. వారు నిరాశతో మఠానికి తిరిగి వచ్చారు.


వారిని చూసిన గురువు ‘‘సాధన బాగా చేశారా? నీరు అంటకుండా వాగును దాటి వచ్చారా?’’ 

అని అడిగాడు.

శిష్యులు తలవంచుకొని, ‘‘లేదు గురువుగారూ! నీరు అంటకుండా అది దాటడం అసాధ్యం. మీరెప్పుడూ అలాంటి పనులే మాకు చెబుతూ ఉంటారు’’ అని గొణుక్కున్నారు.

‘‘అదేమంత కష్టమైన పని కాదే? నేను చేసి చూపిస్తాను, పదండి’’ అన్నాడు బొకుజు.

శిష్యులందరూ ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో, కుతూహలంతో ఆయన వెంట బయలుదేరారు. ‘గురువుగారు నీటి మీద నడిచి అద్భుతం చేస్తారా? అప్పుడైనా ఆయన పాదాలు తడిసిపోతాయి కదా! చూద్దాం, ఎలా చేస్తారో?’ అని వారిలో వారు గుసగుసలాడుకున్నారు.


బొకుజు ఆ వాగులో దిగి అవతలి ఒడ్డుకు నడిచాడు. ఆయన వెంట శిష్యులు కూడా నీళ్ళలోకి దిగారు. ‘అబ్బ! నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో!’ అని కొందరు, ‘కింద ముళ్ళు, పదునైన రాళ్ళు గుచ్చుకుంటున్నాయి’ అని మరికొందరూ అనుకుంటూ ఆయన వెంట నడిచారు.


అటువైపు వెళ్ళిన తరువాత... ..మనం వెనక్కు పోదాం’’ అంటూ మళ్ళీ నీళ్ళలో బొకుజు నడవడం మొదలుపెట్టాడు. గురువు ఒక్క మాట మాట్లాడకుండా... నిర్వికారంగా, ప్రశాంత వదనంతో నడిచి వస్తే, శిష్యులందరూ నీటి గురించీ, అడుగున ఉన్న నేల గురించీ రకరకాలుగా మాట్లాడుతూ గట్టుకు చేరుకున్నారు.

‘‘చూశారా! నీరు తాకకుండా నేను ఎలా దాటానో!’’ అన్నాడు బొకుజు.

శిష్యులు ఆయన కాళ్ళవైపు చూపిస్తూ ‘‘ఎక్కడ గురువర్యా! మీ కాళ్ళు నీటితో తడిశాయి. చూడండి, మీ మోకాళ్ళ వరకూ నీళ్ళు అంటుకున్నాయి’’ అని అన్నారు.


‘‘మీరు చెబుతున్నది నిజమే! నీళ్ళు నా కాళ్ళకు అంటాయి. కానీ నన్ను అంటలేదు. నీటిలో దిగిన వెంటనే మీరంతా నీళ్ళు చల్లగా ఉన్నాయనీ, అడుగున ఉన్న నేల గుచ్చుకుంటోందనీ, నడవడం కష్టంగా ఉందనీ అన్నారు. నేను అలాంటి మాటేదీ అనలేదు. ఎందుకంటే నీరు కానీ, అడుగున ఉన్న నేల కానీ నన్ను తాకలేదు, బాధించలేదు. అలా ఉండడాన్నే సాధన చెయ్యాలి. అలాంటి సాధనే విలువైనది’’ అని చెప్పాడు బొకుజు.


‘‘నీటిలో పడవ ఉండవచ్చు. పడవలోకి నీరు వస్తే అది మునిగిపోతుంది. నీవు సంసారంలో ఉండవచ్చు. సంసారం నీలో ప్రవేశిస్తే మునిగిపోతావు’’ అనేవారు రామకృష్ణ పరమహంస. ‘పద్మపత్ర మివామ్భసా’ అన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు. అంటే ‘తామరాకు నీటిలో ఉన్నా దానికి నీరు అంటదు’ అని అర్థం. బొకుజు తన శిష్యులకు బోధించింది కూడా అదే.

                                                                                         రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-12-10T05:30:00+05:30 IST