‘వి’ ట్యాక్స్‌

ABN , First Publish Date - 2022-07-20T05:13:12+05:30 IST

ఆమె.. ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి సతీమణి. చిన్నస్థాయి ప్రజాప్రతినిధి కూడా. అక్కడ ఆమె సూపర్‌బాస్‌గా చెలామణి అవుతున్నారు. ‘వి-టాక్స్‌’ వసూలు చేస్తున్నారు. అధికారులైనా, పార్టీ కార్యకర్తలైనా ఆమె చెబితే వినాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఆ నియోజకవర్గంలో అభివృద్ధి

‘వి’ ట్యాక్స్‌

ఇరవై శాతం ఇవ్వాల్సిందే.. లేకుంటే అంతే!

బిల్లులు కాగానే సమర్పించుకోవాల్సిందే

ఓ ప్రజాప్రతినిధి సతీమణి వసూళ్ల దందా

ప్రైవేటు పంచాయితీలు.. సెటిల్‌మెంట్లు

చిన్నపనికి చిన్న రేటు.. పెద్దపనికి పెద్ద రేటు

మాజీ సైనికుడి భూ ఆక్రమణకు రైట్‌ రైట్‌

సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు

తలలు పట్టుకుంటున్న అధికారపార్టీ కార్యకర్తలు


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి) 

ఆ నియోజకవర్గంలో ‘వి’ ట్యాక్స్‌ కట్టాల్సిందే. లేకుంటే పనులు అస్సలు జరగవు. బిల్లులు కాగానే కాంట్రాక్టర్లు 20 శాతం కక్కాల్సిందే. ఉద్యోగులు మంచి పోస్టింగ్‌ కోసం సమర్పించాల్సిందే. పంచాయితీలు.. సెటిల్‌మెంట్లు.. ఒకటేమిటీ అన్నీ జరిగిపోతున్నాయి. చిన్న పనికి ఓ రేటు.. పెద్ద పనికి మరో రేటు కడుతున్నారు. ఓ అధికారపార్టీ ప్రజాప్రతినిధి సతీమణి వసూళ్ల వ్యవహారం ఇది. ఆమె చిన్నస్థాయి ప్రజాప్రతినిధి కూడా. కిందిస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ఆమె కనుసన్నల్లో ఉండాల్సిందే. ఆమె చెప్పిన పని చేయాల్సిందే. లేకుంటే తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆమె వ్యవహార శైలితో అధికారపార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. 


- ఆమె.. ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి సతీమణి. చిన్నస్థాయి ప్రజాప్రతినిధి కూడా. అక్కడ ఆమె సూపర్‌బాస్‌గా చెలామణి అవుతున్నారు. ‘వి-టాక్స్‌’ వసూలు చేస్తున్నారు. అధికారులైనా, పార్టీ కార్యకర్తలైనా ఆమె చెబితే వినాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రోడ్ల మరమ్మతులు, కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు వంటివి చేపట్టారు. వాటికి ఉపాధిహామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద బిల్లులను చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు ఏళ్లతరబడి బకాయిలు పేరుకుపోయాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించుకోలేక.. ప్రభుత్వాన్ని ఏమనలేక మిన్నకున్నారు. అయితే ఈమధ్యనే పంచాయతీరాజ్‌ ద్వారా చేపట్టిన పనులకు అధికారులు బిల్లులను క్లియర్‌ చేస్తున్నారు. ఇదే అదునుగా ఆ లేడీబాస్‌ స్పీడ్‌ పెంచారు. తనవాటాగా 20 శాతం ఇవ్వాలని, లేకుంటే కుదరదని తెగేసి చెప్పేశారు. పంచాయతీ స్థాయిలో బిల్లుల చెల్లింపులకు ఆ పంచాయతీ కార్యదర్శి కీలకం. తీర్మానం నుంచి ఇతరత్రావన్నీ పూర్తిచేయాల్సింది కార్యదర్శే. లేడీబాస్‌ ఆదేశాలతో అటు ముందుకు వెళ్లలేక.. ఇటు బిల్లులు చెల్లింపు సిద్ధం చేయలేక వారు ఆందోళనకు గురవుతున్నారు. 

మరో మాట లేదంట

ఏళ్లతరబడి బిల్లుల చెల్లింపులు జరగక కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోయారు. ఆలస్యంగా వచ్చిన బిల్లులకుగాను కమీషన్‌ అడుగుతుంటే వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది ఏమాత్రం భావ్యంకాదంటూ బహిరంగంగానే పంచాయతీ కార్యదర్శుల వద్ద ఆవేదన వెళ్లగక్కుతున్నారు. పంచాయతీ కార్యదర్శులైతే అటు కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లకు సర్దిచెప్పలేక.. ఇటు లేడీబాస్‌ ఆదేశాన్ని పాటించలేక సతమతమవుతున్నారు. 

 టాక్స్‌’ చెల్లించాల్సిందే..

ఇతర నియోజకవర్గాలకు ఈవిషయం కొత్తేగానీ.. లేడీబాస్‌ అమలు చేస్తున్న ‘వి-టాక్స్‌’ మాత్రం ఆ నియోజకవర్గ నాయకులందరికీ తెలిసిన విషయమే. గతంలో అధికారంలో ఉన్నప్పుడూ ఇదేపరిస్థితి. ఇప్పుడు కూడా అదేరీతిలో వి-టాక్స్‌ చెల్లించాల్సి వస్తుందంటూ అధికార పార్టీనేతలు వాపోతున్నారు. బిల్లుల చెల్లింపులకే ‘వి-టాక్స్‌’ పరిమితమం కాలేదు. కోరుకున్న చోట్ల పోస్టింగ్‌ కోసం, బదిలీల సిఫార్సు కోసం కూడా వసూలు చేస్తున్నారు. ఫలానా పనికి.. ఫలానా రేటు అని మాట్లాడుకున్నాకే క్లియర్‌ చేసి పెడుతున్నారు. నియోజకవర్గంలోని అధికారపార్టీ ద్వితీయ స్థాయి నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు వి-టాక్స్‌ విషయం బయటకు కక్కలేక.. మింగలేక మిన్నకుండిపోతున్నారు. అలాఅని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లలేక తమలోతాము బాధలు పంచుకుంటున్నారు. 

మచ్చుకు కొన్ని..

- ఓ మాజీసైనికోద్యోగి తప్పుడు పత్రాలతో గెడ్డ భూములను ఆక్రమించుకున్నాడు. ఇందుకుగాను వి-టాక్స్‌ చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరికీ భూమి కేటాయింపు జరగలేదని తహసీల్దార్‌ స్పష్టం చేసినాసరే... ఆక్రమణ జరిగిపోయింది. 

- స్టేట్‌ హైవేలో చెరువు గట్లపై స్థలాలను ఆక్రమించి షాపులు నిర్మాణానికి కొందరు యత్నించారు. లేడీబాస్‌కు దుకాణదారులు భారీగా వి-టాక్స్‌ చెల్లించుకున్నాక షాపులు తమవేనని నిర్ణయానికి వచ్చేశారు. 

- ఓ దేవస్థానానికి చెందిన రూ.3 కోట్లు విలువచేసే భూములను కొందరు తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకున్నారు. ఇందుకుగాను ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగానే ఆమెకు ముట్టజెప్పారని, అందుకే ఈ వ్యవహారంజోలికి అధికారులు పోలేదని ప్రచారం జరుగుతోంది. 

- కొన్ని పంచాయతీల్లో ఆశా కార్యకర్తల తీరు ఆమెకు నచ్చలేదు. దీంతో గంపగుత్తగా వారిని తొలగించేయాలని హుకుం జారీ చేయడంతో ఓ ఉన్నతాధికారి పని చేసి పెట్టేశాడు. 

- ఇటీవల ఓ మండలకేంద్రంలో కొత్తగా ఏర్పాటైన డిగ్రీకళాశాలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకానికి సంబంధించి రూ.లక్షల్లో ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Updated Date - 2022-07-20T05:13:12+05:30 IST