Jun 16 2021 @ 08:26AM

మరో షార్ట్ ఫిలిం డైరెక్టర్‌కి యూవీ క్రియేషన్స్ ఆఫర్..?

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ నుంచి యంగ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలో మరొక దర్శకుడి వీరు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ప్రభాస్‌తో పాన్ ఇండియన్ సినిమాలు నిర్మిస్తున్న యూవీ క్రియేషన్ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'మిర్చి' సినిమాతో కొరటాల శివ, 'జిల్' సినిమాతో రాధాకృష్ణ కుమార్, 'రన్ రాజా రన్'తో షార్ట్ ఫిలిం డైరెక్టర్ సుజీత్, 'టాక్సీవాలా'తో రాహుల్ సాంకృత్యన్ 'ఏక్ మినీ కథ'తో కార్తీక్ రాపోలు వంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ క్రమంలో 'మనసానమః' అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్‌కి తమ బ్యానర్‌లో దర్శకుడిగా అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. 'మనసానమః' తోపాటుగా పలు షార్ట్ ఫిలింస్ డైరెక్ట్ చేసిన దీపక్ 'ఫిదా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ వారు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుందట.