యూపీలో దుర్మార్గం... కఠిన శిక్షకు మోదీ సూచన

ABN , First Publish Date - 2020-10-01T01:54:25+05:30 IST

కన్న కూతురు కామాంధుల చెరలో పడి నలిగిపోయిందన్న బాధే ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. ఆసుపత్రిలో ప్రాణం ఉన్నా..

యూపీలో దుర్మార్గం... కఠిన శిక్షకు మోదీ సూచన

తల్లితో పాటు పొలానికి వెళ్లిన కూతురికీ రక్షణ కరువైంది. పట్టపగలే భద్రత లేకుండా పోయింది. నలుగురికీ తెలిసేలా అరిచేందుకు ప్రయత్నించినా నాలుక తెగింది. బతికుండగానే జీవచ్ఛవంలా మారింది. చివరకు ఆసుపత్రిలో కన్నుమూసింది. ఇదంతా మనిషి రూపంలో ఉన్న రాబందుల దుర్మార్గం.


కన్న కూతురు కామాంధుల చెరలో పడి నలిగిపోయిందన్న బాధే ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. ఆసుపత్రిలో ప్రాణం ఉన్నా శవంలా మారిన కూతురిని చూసి తట్టుకునే శక్తి సన్నగిల్లింది. ఆఖరికి చికిత్స పొందుతూ తమ కూతురు చనిపోయిందన్న బాధ క్షోభకు గురిచేసింది. కానీ, చివరి చూపులు కూడా లేకుండా చేశారు అన్నీ తెలిసిన పోలీసులు. కనీసం ఇంటికి కూడా తీసుకెళ్లకుండా మృతదేహాన్ని నేరుగా స్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశారు. ఈ పరిణామం ఆ కూతురి తల్లిదండ్రులనే కాదు.. అమ్మాయిలున్న తల్లిదండ్రులందరి గుండెలనూ మెలిపెట్టింది. 



కనీసం తెల్లవారనీయలేదు. చివరి ఘట్టంగా తాను పుట్టి పెరిగిన ఇంటికీ తీసుకెళ్లలేదు. తల్లిదండ్రులకు చివరిచూపు ఇచ్చే అవకాశమూ ఇవ్వలేదు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే, అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయాల్సిన ఖాకీలే ఇక్కడ మానవత్వం లేని వాళ్లుగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘట ఇప్పుడు యావత్‌ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది.


ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ సామూహిక అత్యాచారం సంఘటనకు సంబంధించిన పరిణామాలివి. తల్లితో పాటు పొలం పనులకు వెళ్లిన ఆ కూతురిని కొందరు దుర్మార్గులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.  అరిచేందుకు ప్రయత్నించిన ఆ యువతి నాలుక కోసేశారు. చున్నీతో మెడకు బిగించి హత్యాయత్నం చేశారు. చనిపోయిందనుకొని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 



గత 19వ తేదీన జరిగిందీ సంఘటన. ఆ అమానుషకాండలో యువతి తీవ్రంగా గాయపడింది. నాలుక తెగిపోయింది. వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోయాయి. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చేతులు కూడా పాక్షికంగా చచ్చుబడి పోయాయి. ఈ ఘోరమైన పరిస్థితుల్లో యువతిని అలీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారి పోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు.


ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి.. శారీరకంగా, మానసికంగా కుమిలిపోయిన యువతి మంగళవారం తుదిశ్వాస విడిచింది. దీంతో.. ఆసుపత్రి నుంచి ఆమె స్వగ్రామానికి పోలీసులే మృతదేహాన్ని తీసుకెళ్లారు. డెడ్‌బాడీని కనీసం ఆమె ఇంటికి కూడా తీసుకెళ్లలేదు. ఉద్రిక్తత నెలకొంటుందనే కారణంతో అర్థరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. 



ఆ సమయంలో కనీసం యువతి కుటుంబసభ్యులను కూడా అంత్యక్రియలకు అనుమతించలేదని చెబుతున్నారు. కడసారి కూతురిని చూసుకుంటామని బతిమిలాడినా పోలీసులు వినలేదంటున్నారు. యువతి చనిపోయిందని తెలియగానే సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి పోలీసులు వెంటనే చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. అయితే.. పోలీసులు మాత్రం మృతదేహాన్ని అర్థరాత్రి సమయంలో హత్రాస్‌కు తరలించారు. గ్రామానికి వెళ్లీ వెళ్లగానే స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో.. కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ కడచూపునకు నోచుకోలేకపోయారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. 


గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణంతో విపక్షాలు భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. యూపీ సర్కారు వైఫల్యం, నిర్లక్ష్యంపై విపక్షాలు కన్నెర్రజేశాయి. యూపీ రేపిస్టు క్యాపిటల్‌గా మారిందంటూ ప్రజాసంఘాలు, విపక్షాలు ఆరోపించాయి. యూపీలో గూండాలు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.  


ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రి దగ్గర కూడా రాత్రి పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపిస్టులను ఉరితీయాలని, ఆస్పత్రి ముందు నినాదాలు చేశారు. దీంతో.. పోలీసులు యువతి తండ్రి, సోదరుడిని కూడా బలవంతంగా పోలీసు వాహనాల్లో తీసుకెళ్లారు.



మరోవైపు.. మృతదేహానికి అంత్యక్రియలపై వెల్లువెత్తుతున్న విమర్శలను జిల్లా అధికారులు ఖండించారు. బాధితురాలి తండ్రి, సోదరుడు అంగీకరించడం వల్లే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని వివరణ ఇచ్చారు.  అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. 


అటు, ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. ఈ ఘటనపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బృందానికి రాష్ట్రహోంశాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారన్నారు. వారం రోజుల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు. అంతేకాదు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మరోవైపు.. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మోదీ సూచించారు.


- సప్తగిరి గోపగోని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


Updated Date - 2020-10-01T01:54:25+05:30 IST