హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి...

ABN , First Publish Date - 2021-03-02T14:47:45+05:30 IST

ఆన్‌లైన్‌లో స్నేహం చేసి, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి

హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి...

  • స్నేహానికి గిఫ్ట్‌ మోసం
  • యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో స్నేహం చేసి, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, విదేశాల నుంచి గిఫ్ట్‌ పంపిస్తానంటూ రూ. లక్షలు దోచుకున్న మోసగాడిని సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. తార్నాకకు చెందిన ఓ యువతి ఓ మ్యాట్రిమోని సైట్‌లో తన వివరాలు ఉంచింది. ఆమెకు రాజీవ్‌ మాక్‌ అనే యువకుడు ఆ సైట్‌లో పరిచయమయ్యాడు. యూకేలో ఉద్యోగం చేస్తున్నానని, బెంగళూరులో సెటిల్‌ అవుతున్నట్లు చెప్పాడు. పరిచయం పెరిగిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఆమె కోసం ప్రత్యేకంగా యూకే నుంచి గిఫ్ట్‌ పార్సిల్‌  పంపిస్తున్నానని చెప్పాడు. అతను చెప్పినట్టే ఒకటి రెండు రోజుల్లో ఆమెకు ఢిల్లీ కస్టమ్స్‌ కార్యాలయం, జీఎస్టీ కార్యాలయం నుంచి అంటూ ఫోన్లు వచ్యాయి. 


పార్సిల్‌ తీసుకోడానికి వివిధ రుసుములు చెల్లించాలని ఫోన్లు చేసిన వారు వేధించారు. ట్యాక్స్‌, రుసుము చెల్లించకుంటే పార్సిల్‌ వెనక్కి పంపిస్తామని బెదిరించారు. దీంతో సదరు యువతి వారు చెప్పిన అకౌంట్లకు రూ. 10.69 లక్షలు పంపించింది. ఆ తర్వాత ఫోన్లు రాకపోవడంతో అనుమానించిన బాధితురాలు గతేడాది అక్టోబర్‌ 16న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు  నిందితుడైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, భోజిపురా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ హాషిమ్‌ (21) అలియాస్‌ పప్పూను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.


విచారించగా, వివిధ మ్యాట్రిమోని సైట్‌ల ద్వారా యువతులను, విడాకులు పొందిన వారిని గుర్తించి వారితో పరిచయం పెంచుకుంటాడని తేలింది. యూకేలో ఉద్యోగం చేస్తున్నట్లు నటించి, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.  ఖరీదైన కానుకలు పంపిస్తున్నానని నమ్మిస్తాడు. గ్యాంగులోని ఇతర సభ్యులు కస్టమ్‌ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖాధికారులుగా చెప్పుకుంటూ ఫోన్లు మొదలు పెట్టి తమ నాటకాన్ని రక్తికట్టిస్తారు. ఇలా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి సహకరించిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. 

Updated Date - 2021-03-02T14:47:45+05:30 IST