ఉత్తరఖండ్‌లో తీవ్ర వేసవి తాపం.. కరుగుతున్న మంచుకొండలు

ABN , First Publish Date - 2022-04-21T22:23:58+05:30 IST

డెహ్రాడున్ : తెల్లని మంచుకొండల అందాలతో చూపరులను ఆకట్టుకునే ఉత్తరఖండ్ ఈ ఏడాది తీవ్ర వేసవి తాపంతో సెగలు కక్కుతోంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అక్కడ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గత..

ఉత్తరఖండ్‌లో తీవ్ర వేసవి తాపం.. కరుగుతున్న మంచుకొండలు

డెహ్రాడున్ : తెల్లని మంచుకొండల అందాలతో చూపరులను ఆకట్టుకునే ఉత్తరఖండ్ ఈ ఏడాది తీవ్ర వేసవి తాపంతో సెగలు కక్కుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో అక్కడ నమోదయిన ఉష్ణోగ్రతలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ నమోదుకాలేదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీర్ఘకాలంపాటు పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల స్థాయిల కారణంగా మంచు కరిగే రేటు కూడా పెరిగిందని వాతావరణ కేంద్రం వివరించింది. అధిక ఎత్తులో ఉండే బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి ప్రాంతాల్లో గత కొన్నేళ్ల మాదిరిగా ప్రస్తుతం మంచు లేదు. హేమకుంద్ సాహిబ్ మార్గంలో వేగంగా మంచు కరిగిపోతోందని ప్రాంతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఏప్రిల్ 20 మధ్య ఇక్కడ సగటు ఉష్ణోగ్రత కంటే కనీసం 5-7 డిగ్రీలు మేర పెరుగుదల నమోదయింది. ఉత్తరఖండ్‌లోని మైదాన, పర్వత ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణగా చూస్తే.. డెహ్రడున్‌లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. సాధారణం కంటే ఇది 6 డిగ్రీలు అధికం. కాగా అదేరోజు కనిష్ఠ ఉష్ణోగ్రత 20.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు ఎక్కువగా ఉంది. కాగా ఈ ఉత్తరఖండ్‌లో మంచు కరుగుతున్న వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.


కాగా ఈ తరహా ఉష్ణోగ్రతలు చివరిసారిగా 2004లో నమోదయ్యాయి. అప్పుడు తక్కువకాలం 15 రోజులు మాత్రమే ఈ పరిస్థితి కొనసాగింది. కానీ సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అక్కడ నమోదయిన ఉష్ణోగ్రతలు వేడిపుట్టించాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఏడాది మార్చిలో అక్కడ 100 శాతం లోటు వర్షపాతం నమోదయింది. కాగా ఆ తర్వాతి నెల ఏప్రిల్‌లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ విభాగం డైరెక్టర్ బిక్రమ్ సింగ్  వెల్లడించారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఉత్తరఖండ్‌లో 96 శాతం లోటు వర్షపాతం నమోదయింది. ఇక ఏప్రిల్‌లో ఇప్పటివరకు 79 శాతం లోటు వర్షపాతం నమోదయిందని ఆయన వివరించారు.

Updated Date - 2022-04-21T22:23:58+05:30 IST