కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-11T20:09:49+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజృంభిస్తుండటంతో లిక్విడ్

కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఆగ్రహం

డెహ్రాడూన్ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజృంభిస్తుండటంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర అవసరాలకు తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును ఆ రాష్ట్ర హైకోర్టు దుయ్యబట్టింది. రాష్ట్రంలో మూడు ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఉన్నప్పటికీ, ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడవలసి వస్తోందని, తన కోటాను తాను పొందలేకపోతోందని హైకోర్టు పేర్కొంది. 


ఉత్తరాఖండ్‌‌కు రోజుకు 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ చెప్పారు. ఆసుపత్రులు 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, రాష్ట్రంలో మరికొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నాయని, వీటి ద్వారా మరొక 4 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. 


రాష్ట్రంలో 2020 మార్చిలో 673 ఆక్సిజన్ బెడ్స్ ఉండేవని, ప్రస్తుతం వీటి సంఖ్య 5,500కు పెరిగిందని  రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ నేగీ చెప్పారు. 2020 మార్చిలో 216 ఐసీయూలు ఉండేవని, ప్రస్తుతం వీటి సంఖ్య 1,390కి చేరిందని చెప్పారు. వెంటిలేటర్లు కూడా 116 నుంచి 876కు పెరిగినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో కోవిడ్ కారణంగా సుమారు 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు. 


కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-05-11T20:09:49+05:30 IST