రావత్ అంత్యక్రియల రోజు నృత్యాలా?: మండిపడిన సీఎం

ABN , First Publish Date - 2021-12-13T01:25:03+05:30 IST

కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారంనాడు..

రావత్ అంత్యక్రియల రోజు నృత్యాలా?: మండిపడిన సీఎం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారంనాడు విమర్శలు గుప్పించారు. యావద్దేశం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు 12 మంది వీరసైనికుల మరణంతో విషాదంలో మునిగిపోయిన తరుణంలో గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం, డాన్సులు చేయడం సిగ్గుచేటని అన్నారు. నేరుగా ఆయన కాంగ్రెస్ పేరును ప్రస్తావించకుండా...''సీడీఎస్ రావత్ అంత్యక్రియలు జరుగుతుంటే...ఒక పార్టీ సంబరాలు చేసుకుంది. వాళ్లు సిగ్గుపడాలి. దేశాన్ని 55 ఏళ్లు ఏలిన ఒక కుటుంబానికి అమరవీరుల విషయంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. గోవాలో డాన్సులు చేస్తూ, ఎన్నికల ప్రచారం ప్రారంభించారు'' అని అన్నారు.


ఈనెల 10న గోవాలో ప్రియాంక గాంధీ డాన్సింగ్ వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. క్యూపెం అసెంబ్లీ నియోజకవర్గంలోని మోర్పిర్ల గ్రామంలో గిరిజనులతో ప్రియాంక గాంధీ ముఖాముఖీ సంభాషించారు. అనంతరం గిరిజన మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యంలో ప్రియాంక పాల్గొన్నారు.

Updated Date - 2021-12-13T01:25:03+05:30 IST