LuLu Mall Namaz row: అరెస్టయినవారి పేర్లపై తప్పుడు ప్రచారం : పోలీసులు

ABN , First Publish Date - 2022-07-20T19:21:18+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న లులు మాల్‌‌లో నమాజ్ చేసినవారు హిందువులేనని,

LuLu Mall Namaz row: అరెస్టయినవారి పేర్లపై తప్పుడు ప్రచారం : పోలీసులు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న లులు మాల్‌‌లో నమాజ్ చేసినవారు హిందువులేనని, హిందువులు ముస్లింలుగా అభినయించి నమాజు చేశారని, వారినే పోలీసులు అరెస్టు చేశారని జరుగుతున్న ప్రచారానికి లక్నో పోలీసు కమిషనరేట్ తెర దించింది. లులు మాల్‌లో నమాజు చేసిన నలుగురిని అరెస్టు చేశామని చెప్తూ వారి పేర్లను ప్రకటించింది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించేందుకు ప్రయత్నించినవారిని కూడా అరెస్టు చేశామని చెప్తూ, వారి పేర్లను కూడా తెలిపింది. 


లులు మాల్ (LuLu Mall)లో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa)ను పఠించేందుకు ప్రయత్నించిన సరోజ్ నాథ్ యోగి, కృష్ణ కుమార్ పాఠక్, గౌరవ్ గోస్వామిలను జూలై 15న అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు వివరించారు. అదే విధంగా ఈ మాల్‌లో నమాజు చేసేందుకు ప్రయత్నించిన అర్షద్ అలీని అదే రోజున అరెస్టు చేశామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో ఈ వ్యక్తులెవరూ లేరని స్పష్టం చేశారు. 


జూలై 12న వైరల్ అయిన వీడియోలో నమాజు చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కనిపించింది. వీరి పేర్లు... లక్నోకు చెందిన మహమ్మద్ రెహాన్, లఖింపూర్ ఖేరీ జిల్లావాసి అతిఫ్ ఖాన్, లహర్‌పూర్‌వాసులు మహమ్మద్ లోక్‌మన్ అలీ, మహమ్మద్ నోమన్ అలీ అని పోలీసులు తెలిపారు. 


అయోధ్య (Ayodhya) పరమహంస దాస్ వీడియో వైరల్

జూలై 12న నమాజు చేసిన లులు మాల్‌లోని ప్రదేశాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చిన అయోధ్యకు చెందిన ఆచార్య పరమహంస దాస్ (Acharya Paramahamsa Das) పోలీసులతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆయనను పోలీసులు మంగళవారం అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు ముందస్తు కస్టడీకి తీసుకున్నారు. తన నుంచి దూరంగా ఉండాలని ఆయన పోలీసులకు చెప్తుండటం ఈ వీడియోలో కనిపించింది. ‘‘నేను కాషాయ వస్త్రాలు ధరించినందువల్ల మాల్‌లోకి నన్ను వెళ్ళనివ్వలేదు’’ అని ఆచార్య పరమహంస దాస్ ఆరోపించారు. 


యోగి ఆదిత్యనాథ్ సీరియస్

లులు మాల్‌లో నమాజు చేయడంపై వివాదం ముదురుతోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సోమవారం మాట్లాడుతూ, ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో నలుగురిని అరెస్టు చేశారు. వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే లులు మాల్ రాజకీయ కేంద్రంగా మారిందన్నారు. కొందరు అనవసరమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. మాల్‌ను సందర్శించడానికి వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారన్నారు. 


లులు మాల్ ప్రకటన

తమ మాల్‌లో ఎటువంటి మతపరమైన కార్యకలాపాలను అనుమతించబోమని లులు మాల్ జూలై 17న స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నోటీసులను అంటించినట్లు తెలిపింది. ఈ మాల్ యజమాని భారత సంతతికి చెందిన ముస్లిం సంపన్నుడని, అందువల్ల ఈ మాల్‌లో పని చేసే సిబ్బందిలో అత్యధికులు ముస్లింలేనని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై మాల్ స్పందిస్తూ, తమ వద్ద పనిచేసేవారిలో 80 శాతం మందికిపైగా హిందువులేనని తెలిపింది. మిగిలినవారిలో ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులు ఉన్నారని పేర్కొంది. తమ సంస్థలో మతపరమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. 


Updated Date - 2022-07-20T19:21:18+05:30 IST