కమలానికి యూపీ సవాల్‌!

ABN , First Publish Date - 2021-11-27T07:07:02+05:30 IST

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష కానుంది. ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు మరోసారి సంఘటితమైతేనే యూపీలో తాము...

కమలానికి యూపీ సవాల్‌!

అగ్నిపరీక్షగా అసెంబ్లీ ఎన్నికలు

మోదీ, యోగి ప్రభుత్వాలపై వ్యతిరేకత!

హిందూ ఓట్ల సంఘటితంపైనే బీజేపీ ఆశలు

చరణ్‌సింగ్‌ దారిలోనే జయంత్‌ చౌదరి

పొత్తు కోసం అఖిలేశ్‌తో ఆర్‌ఎల్డీ చర్చలు

జాట్లు, యాదవుల ఓట్ల సంఘటితమే లక్ష్యం

చిన్న చిన్న పార్టీల వైపూ అఖిలేశ్‌ చూపు


న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష కానుంది. ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు మరోసారి సంఘటితమైతేనే యూపీలో తాము పట్టు నిలబెట్టుకొనే అవకాశముందని ఆ పార్టీ అంతర్గతంగా అభిప్రాయపడుతోంది. 2014, 2019లోక్‌ సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓట్లు సంఘటితం కావడంతో పాటు మోదీ జనాదరణ మూలంగా బీజేపీకి భారీ లబ్ధి చేకూరింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని, మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు ప్రభుత్వ వ్యతిరేకత తప్పదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు హిందూ ఓటుబ్యాంకు కూడా చీలిపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నాయి.


ఉత్తర ప్రదేశ్‌ లో జరిగే ఎన్నికలను తాము సెమీఫైనల్స్‌ గా భావించాల్సి ఉంటుందని, యూపీలో బీజేపీ దెబ్బతింటే ఆ ప్రభావం 2024 ఎన్నికలపైనా పడుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రామమందిర నిర్మాణం శరవేగంతో జరుగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో మాదిరి హిందూ ఓట్లు సంఘటితం కావడం అంత సులభం కాదని తెలిసినందువల్లే ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ఎస్పీ, ఆర్‌ఎల్డీ పొత్తు చర్చలు

ఈ సారి బీజేపీని ఎలాగైనా దెబ్బతీయాలని ఎస్పీ పావులు కదుపుతోంది.  ఆర్‌ఎల్‌డీతో పొత్తుకు సై అంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇరు పార్టీల అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌, జయంత్‌ చౌదరి ఎన్నికల పొత్తు కోసం చర్చలు జరిపారు. ఈ పొత్తు ఖాయమైతే అది యూపీ రూపు రేఖల్ని మార్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పలు చిన్నపార్టీలనూ తనతో కలుపుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. గతంలో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ రెండు పార్టీల మధ్య ఉన్న చిరకాలవైరం కారణంగా ఓటు బదిలీ సరిగా జరగలేదు. అందుకే ఈ సారి చిన్నచిన్న పార్టీలను కలుపుకెళ్లే వ్యూహానికి అఖిలేశ్‌ పదును పెడుతున్నారు. గతంలో బీఎస్పీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌, పీస్‌ పార్టీ మొదలైన పార్టీల మధ్య చీలిపోయిన బీజేపీ వ్యతిరేక ఓట్లు ఈసారి బలంగా సమాజ్‌ వాది కూటమి వైపు మొగ్గు చూపవచ్చునని భావిస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ యూపీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు బలంగా రాష్ట్రీయ లోక్‌ దళ్‌ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.


రైతుల పట్ల అనుసరించిన వైఖరి ఇతర వర్గాలనుకూడా బీజేపీకి ప్రతికూలంగా మార్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సారి ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. 2013లో ముజఫర్‌ నగర్‌ హింసాకాండ తర్వాత జాట్లలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌ ప్రభావం క్షీణిస్తూ వచ్చింది. కాని రైతుల నిరసన ప్రారంభమైనప్పటి నుంచీ ఈ పార్టీ పరిస్థితి మెరుగవుతూ వచ్చింది. అత్యంత బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆర్‌ఎల్డీకి దాదాపు 22 సీట్లలో పదిశాతం పైగా ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎస్పీతో ఆర్‌ఎల్డీ చేతులు కలపడంతో జాట్లు, ముస్లింలు, యాదవులు కొన్ని సీట్లలో సంఘటితమయ్యే అవకాశాలున్నాయి. నిజానికి 1970లలోనే అజిత్‌ సింగ్‌ తండ్రి చౌదరి చరణ్‌సింగ్‌.. జాట్లను, యాదవులను సంఘటితం చేసి కాంగ్రెస్‌ పట్టును దెబ్బతీశారు. ఇప్పుడు అదే ప్రయోగాన్ని మళ్లీ అమలు చేసి బీజేపీ పట్టును దెబ్బతీయాలని అఖిలేశ్‌, జయంత్‌ యోచిస్తున్నారు. రైతుల ఉద్యమ ప్రభావం పశ్చిమ యూపీతోపాటు మధ్య, తూర్పుయూపీ, బుందేల్‌ ఖండ్‌లకు విస్తరించడం వీరి కూటమికి ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. యూపీలో ఎస్పీ విజయం సాధిస్తే దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవకాశాలు గతంలోకంటే మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు.


గత ఎన్నికల్లో ఇలా...

గత ఎన్నికల్లో మోదీ జనాదరణ, వివిధ సామాజిక వర్గాల విభజన బీజేపీకి ఉపయోగపడ్డాయి. సాంప్రదాయంగా రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఓట్లు వేసే జాట్లు 2014 నుంచి ఆర్‌ఎల్డీకి దూరమయ్యారు. అంతేకాక ఎస్పీ, బీఎస్పీలనూ విస్మరించారు. గ్రామీణప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకు సంఘటితం కావడంతో గత లోక్‌ సభ ఎన్నికల్లో 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ గెలుచుకుంది. బీజేపీ జాతీయ వాదం, హిందూత్వ ముందు కుల సమీకరణలు కొట్టుకుపోయాయి. 49.56 శాతం ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటువేయగా, సమాజ్‌ వాది పార్టీ- బహుజన సమాజ్‌ పార్టీ- రాష్ట్రీయ లోక్‌ దళ్‌ కూటమికి 38.9 శాతం ఓట్లే లభించాయి.


ముస్లిమేతర, దళితేతర ఓటర్లు సంఘటితం కావడంతో ఎస్పీ, బీఎస్పీలను సులభంగా దెబ్బతీయగలిగారు. 20 శాతంపైగా ముస్లింలున్న సీట్లలోనూ బీజేపీ అధిక సీట్లను కైవసం చేసుకోగలింది. సీఎ్‌సడీఎ్‌స-లోక్‌నీతి సంస్థ విశ్లేషణ ప్రకారం 91% జాట్లు గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చారు. దళితుల్లో అత్యధిక భాగం ఉన్న జాతవులు గత ఎన్నికలనుంచే బీఎస్పీకి దూరం కావడం ప్రారంభించా రు. ప్రధానంగా జాతవేతర దళితుల్లో 48ు పైగా బీజేపీకి ఓటేశారు. అగ్రవర్ణాలతో పాటు కుర్మిలు, కొయిరీలు, ఇతర వెనుకబడిన వర్గాల్లో అత్యధికులు బీజేపీకి ఓటు వేశారని తేలింది. జాతవులు, ముస్లింలు, యాదవులు రాష్ట్ర జనాభాలో 40ు పైగా ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Updated Date - 2021-11-27T07:07:02+05:30 IST