టీఆర్‌ఎస్‌, బీజేపీలకు షాక్‌ ఇవ్వాలి...

ABN , First Publish Date - 2021-03-05T06:25:10+05:30 IST

టీఆర్‌ఎస్‌, బీజేపీలకు షాక్‌ ఇవ్వాలి...

టీఆర్‌ఎస్‌, బీజేపీలకు షాక్‌ ఇవ్వాలి...
విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాములునాయక్‌ తదితరులు

హామీలు ఎగ్గొట్టడంలో ఇద్దరూ ఒకటే..  
అమలుకు నోచుకోని రాష్ట్ర విభజన చట్టం
ఎమ్మెల్సీగా ఉద్యమకారుడు రాములునాయక్‌ను గెలిపించాలి   
టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నగరంలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం


కేయూ క్యాంప్‌స/వడ్డెపల్లి/సుబేదారి, మార్చి 4: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు దిమ్మదిరిగే షాక్‌ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్‌ రాములునాయక్‌కు మద్దతుగా గురువారం కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ నేతలు ప్రచారం నిర్వహించారు. కేయూ రెండో గేటు నుంచి పలు విభాగాలను తిరుగుతూ రాములునాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.డేవిడ్‌ను ఆయన చాంబర్‌లో కలిసి కాంగ్రెస్‌ నేతలు ప్రచార పత్రాన్ని అందజేశారు. అంతకుముందు పోతన, స్కాలర్స్‌ హాస్టళ్లలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాములునాయక్‌, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, పరకాల ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డిలతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో కేయూ విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. టెక్స్‌టైల్‌ పార్కు, రింగ్‌రోడ్డు, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని ముఖం చాటేశారని అన్నారు. ప్రపంచ స్థాయి పేరుప్రఖ్యాతులు కలిగిన కేయూను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ గురించి టీఆర్‌ఎస్‌ అడగదని, బీజేపీ ప్రభుత్వం ఇవ్వదని ఎద్దేవా చేశారు.

కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెచ్చేందుకు పోరాడుతామని హామీ ఇచ్చారు.  కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను కమీషన్ల కోసమే పెట్టారని, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీపై కమీషన్‌ రాదనే దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు దిమ్మదిరిగే షాక్‌ ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు రాములునాయక్‌ను గెలిపించాలని కోరారు. రాములునాయక్‌ మాట్లాడుతూ.. ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఏమయ్యాని ప్రశ్నించారు. రాజేశ్వర్‌రెడ్డి కేయూకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తిని శ్రీనివా్‌సరావు, బి.అశోక్‌రెడ్డి,  దొమ్మాటి సాంబయ్య, కొత్తపల్లి శ్రీనివాస్‌, మీసాల ప్రకాశ్‌,  ఎంబాడి రవీందర్‌,  పోశాల పద్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగులకు మొండి చేయి
ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారికి మొండి చేయి చూపించిందని టీపీసీసీ చీఫ్‌, ఎంపీ  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. హన్మకొండ వడ్డెపల్లిలోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్‌లో గురువారం ఐఎన్‌టీయూసీ విద్యుత్‌ విభాగం నాయకులతో  నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ప్రపంచంలోనే అతి పెద్ద యూనియన్‌ అని విద్యుత్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు.  ప్రశ్నించే గొంతుకైన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపిస్తే మండలిలో విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తారని అన్నారు.  నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హన్మంతరావు, ఐఎన్‌టీయూసీ విద్యుత్‌ విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో ప్రచారం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ జిల్లా కోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , మాజీ ఎంపీ వి. హనుమంతరావు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్ల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌, పరకాల నియోజకవర్గ కో ఆర్డినేట ర్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, మాజీ మేయర్‌ స్వర్ణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో న్నాయవాదులను కలుసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థి  రాము లు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.



Updated Date - 2021-03-05T06:25:10+05:30 IST