Abn logo
Mar 7 2021 @ 00:17AM

హంస వాహనంపై ఆదిదేవుడు

శ్రీశైలం, మార్చి 6: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలు, హారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలికి తోడ్కొనివచ్చి గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముందు కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు, జాంజ్‌ పథక్‌, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, బంజారా నృత్యం, శంఖనాదాలు ఆకట్టుకున్నాయి. హంస వాహనంపై స్వామి అమ్మ వార్లను భక్తులు కన్నులారా దర్శించుకున్నారు. సాయంత్రం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామరావు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

నేడు మయూర వాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement