Abn logo
May 15 2020 @ 04:50AM

టెన్నిస్‌ రీస్టార్ట్‌..

Kaakateeya

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అల్లాడి పోతోంది. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. వైరస్‌ దెబ్బ తో చాలా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడ్డాయి. పరిస్థితులు చక్కబడతాయా? ఆటల పరిస్థితేంటనే చర్చ ఒక పక్కన పెద్ద ఎత్తున జరుగుతుండగా కరోనా విజృంభిస్తున్న అమెరికాలో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ మళ్లీ ఆరంభం కావడం ఆసక్తి రేపుతోంది. అగమ్యగోచరంగా మారిన టెన్ని్‌సకు యూటీఆర్‌ పురుషుల ప్రొ మ్యాచ్‌ సిరీస్‌ చుక్కానిలా నిలిచింది. ఆగిన టెన్ని్‌సను మళ్లీ ఎలా రీస్టార్ట్‌ చేయాలో మార్గనిర్దేశం చేసింది. అయితే, ‘కరోనా ముందు.. కరోనా తర్వాత’ పరిస్థితులకు ఈ టోర్నీ అద్దం పట్టింది. 


 భవిష్యత్‌కు అద్దం పట్టిన  యూటీఆర్‌ ప్రొ మ్యాచ్‌ సిరీస్‌

 ప్రేక్షకులకు నో ఎంట్రీ 

 రాకెట్‌ ట్యాప్‌తో పలకరింపు

 నెట్‌లో ప్రత్యక్ష ప్రసారం


ఫ్లోరిడా (అమెరికా): యూటీఆర్‌ పురుషుల ప్రొ మ్యాచ్‌ సిరీ్‌సను మూడ్రోజుల పాటు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఫ్లోరిడా, వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని ఓ ప్రైవేటు కోర్టులో నిర్వహించారు. ఈ టోర్నీకి ఆటగాళ్ల నుంచి మంచి మద్దతు లభించిం ది. నలుగురు క్రీడాకారులు బరిలోకి దిగారు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లను యూట్యూబ్‌ చానెల్స్‌లోనూ ప్రత్యక్షప్రసారం చేశారు. అయితే, టోర్నీ నిర్వహణ తీరుచూస్తే పరిస్థితులు ఎంతో మారిపోయినట్టు స్పష్టమైంది. 


చైర్‌ అంపైర్‌.. ఇద్దరు ప్లేయర్లే..

 మొత్తం కోర్టులో కనిపించింది ఒక చైర్‌ అంపైర్‌, ఆడే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే.

 లైన్‌ అంపైర్లు లేరు. లైన్‌ కాల్స్‌ను ఆటగాళ్లు చెప్పాలి. చైర్‌ అంపైర్‌ మాస్క్‌, గ్లౌజ్‌లు ధరించాడు.

 మార్చిలో టెన్నిస్‌ కార్యకలాపాలను సస్పెండ్‌ చేసిన తర్వాత టాప్‌-100లోపు ఆటగాళ్లు బరిలోకి దిగిన తొలి టోర్నీ ఇదే. టాప్‌-60 లోపు నలుగురు ప్లేయర్లు ఆడారు.

 ఆటగాళ్లకి టవల్స్‌తో పాటు బంతులు అందించే బాల్‌ బాయ్స్‌ ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో తమ అవసరాలను ఆటగాళ్లే చూసుకోవాల్సి వచ్చింది. 

 మ్యాచ్‌కు ముందు ప్లేయర్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి గౌరవంగా పలకరించుకోవడం సాధారణంగా టెన్ని్‌సలో కనిపించేది. కానీ, కొత్తగా భౌతిక దూరం పాటిస్తూ రాకెట్‌ ట్యాప్‌తో విష్‌ చేసుకున్నారు. 

 కోర్టు చుట్టూ ఫెన్సింగ్‌ వేసి బయటి వారు కనిపించకుండా కొన్ని వైపులు మూసేశారు. ప్రేక్షకులను అనుమతించకపోవడంతో సందడే లేకుండా మ్యాచ్‌ జరగడం ఆటగాళ్లకు సరికొత్త అనుభవం.

 కోర్టు మొత్తాన్నీ క్రిమి సంహారక ద్రావణంతో శానిటైజ్‌ చేశారు. నెట్‌ను కూడా ఎంతో జాగ్రత్తగా తుడిచారు. 

 బంతుల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఆటగాడికి వేర్వేరుగా బంతులను మార్క్‌ చేసి ఇచ్చారు. వీటితోనే వాళ్లు సర్వీస్‌ చేసేలా చూశారు. సర్వీస్‌ అనంతరం బంతులను శానిటైజ్‌ చేశారు.

  ఇదే కోర్టులో మహిళల ఈవెంట్‌ ఈ నెల 22-24 మధ్య జరగనుంది. అమెరికా ప్లేయర్లు అలిసన్‌ రిస్కే, అమండా అనిసిమొవా, డానియెల్లీ కొలిన్స్‌తో పాటు అజ్లా టోమ్లజనోవిచ్‌ (ఆస్ట్రేలియా) తలపడనున్నారు. 


విజేత ఒప్లెకా..

నలుగురు ఆటగాళ్లు తలపడిన ఈ యూటీఆర్‌ పురుషుల ప్రొ మ్యాచ్‌ సిరీస్‌లో అమెరికా ప్లేయర్‌ రిల్లీ ఒప్లెకా విజేతగా నిలిచాడు. ఫైనల్లో 4-3, 2-4, 4-2తో మిమోమిర్‌ కెక్‌మెనోవిచ్‌పై నెగ్గాడు. 


మరిన్ని ఈవెంట్లు..

ఈ టోర్నీ స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని ఈవెంట్లను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లోని మోర్టగ్లో టెన్నిస్‌ అకాడమీలో అల్లిమేట్‌ టెన్నిస్‌ షోడౌన్‌, ఆస్ట్రేలియాలో డొమినిన్‌ థీమ్‌ నేతృత్వంలో ద జనరలి ఓపెన్‌ ప్రొ సిరీస్‌, బెల్‌గ్రేడ్‌లోని తిప్సర్వెక్‌ టెన్నిస్‌ అకాడమీలో ఈస్ట్రన్‌ యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పను నిర్వహించనున్నారు. 

Advertisement
Advertisement