‘సంపద’ కేంద్రాలను నూరుశాతం వినియోగంలోకి తేవాలి

ABN , First Publish Date - 2022-05-18T05:15:24+05:30 IST

జిల్లాలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నూరుశాతం వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌ బాబు అధికారులను ఆదేశించారు.

‘సంపద’ కేంద్రాలను నూరుశాతం వినియోగంలోకి తేవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ప్రతి ఇంటి నుంచి తడిచెత్త, పొడిచెత్త వేరుగా ఇవ్వాలి

 కలెక్టర్‌ కేవిఎన్‌. చక్రధర్‌బాబు

 మనుబోలు, మే 17: జిల్లాలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నూరుశాతం వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌ బాబు  అధికారులను ఆదేశించారు. మనుబోలులోని చెత్త సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్ప  సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 434 చెత్త సంపద తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో వసతులతో  నడుస్తు న్నాయన్నారు. 200 కేంద్రాలు మరమ్మతులు, అరకొరనిర్మాణాల్లో ఉన్నాయ న్నారు.  మనుబోలును మోడల్‌గా తీసుకునేలా అధికారులు సిద్ధం చేయాల న్నారు. కేంద్రంలో తయారైన వర్మికంపోస్టు ( సేంద్రియ ఎరువు)ను రోడ్డు పక్కన ప్రదర్శనలా పెడితే వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. కేంద్రం వద్దనే ఈ ఎరువులతో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచేలా చేయాలన్నారు.  ప్రతి ఇంటి నుంచి తడిచెత్త, పొడిచెత్త వేరుగా ఇవ్వాలన్నారు.ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, తెల్లారే సరికి రోడ్లపైకి చెంబులు ఎత్తుకుని రాకుండా అడ్డుకోవాలన్నారు.  మనుబోలు, కాగితాలపూరులో చెత్తబుట్టలు అందరికీ ఇవ్వలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన త్వరలోనే ప్రతి ఇంటికి రెండేసి బుట్టల పంపిణీ చేస్తారన్నారు. అనంతరం కలెక్టర్‌ మనుబోలు-2 సచివాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలో ఇంకా ఓటీఎస్‌ నూరుశాతం ఎందుకు కాలేదని, అయ్యేలా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. డబ్బులు కట్టినవారందరికీ పట్టాలు ఇచ్చేలా శ్రద్ధపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, జడ్పీ సీఈవో వాణిరెడ్డి, ఆర్డీవో కొండయ్య, డీసీ శ్రీనువాసులు రెడ్డి, డీఎల్‌పీవో కృష్ణమోహన్‌, తహసీల్దార్‌ నాగరాజు, సర్పంచు కంచి పద్మమ్మ, ఉపసర్పంచు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.





Updated Date - 2022-05-18T05:15:24+05:30 IST