న్యాయ సేవలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T06:40:20+05:30 IST

న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, చట్టాలపైనా న్యాయ సేవలపైనా ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎం.జి.ప్రియదర్శిని అన్నారు.

న్యాయ సేవలను వినియోగించుకోవాలి
వీధి వ్యాపారులకు రుణాల చెక్కు అందజేస్తున్న జడ్జి

- కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎం.జి.ప్రియదర్శిని 

- జిల్లా కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు

- వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన 

సిరిసిల్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, చట్టాలపైనా న్యాయ సేవలపైనా ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. శనివారం   జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌లో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిం చడం, సంక్షేమ చట్టాల గురించి తెలియజేయడం, లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడం వంటివి నల్సా చట్టం  ముఖ్య ఉద్దేశమన్నారు. చట్టం, న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు  చట్టాలు, న్యాయ సేవల గురించి ఎక్కువగా తెలియదని, వారికి సరైనరీతిలో అవ గాహన కల్పించాలని కోరారు. ఈ సదస్సులో సిరిసిల్ల అదనపు జిల్లా సెషన్‌ జడ్జి ఎం.జాన్సన్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే,  అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, కరీంనగర్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ కార్యదర్శి బి.సుజయ్‌, జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు, సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న ప్రభుత్వ స్టాళ్లు

సదస్సులో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖ, కార్మిక, లీడ్‌ బ్యాంక్‌, విద్యాశాఖ, వైద్య మరియు అరోగ్య శాఖ, అటవీ, మత్స్య శాఖ, మిషన్‌భగీరథ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, ఉద్యాన శాఖ, ఎస్సీ వెల్ఫేర్‌, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, ఉచిత న్యాయ సలహా కేంద్రం స్టాళ్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. స్టాళ్లను కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్‌ జడ్జి ప్రియదర్శిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 

రుణాల చెక్కుల అందజేత 

గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రాజరాజేశ్వరి జిల్లా సమాఖ్యకు రూ.5 కోట్ల రుణాల చెక్కును జడ్జి ప్రియదర్శిని అందజేశారు. సిరిసిల్ల పట్టణ సమాఖ్యలోని 75 మహిళా సంఘాలకు రూ.5 కోట్లు, స్త్రీనిధి ద్వారా 1256 మహిళా సంఘాలకు రూ.5 కోట్లు, వేములవాడ ఉమమహేశ్వర పట్టణ సమాఖ్యకు రూ.2 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. 52 మంది అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలు, కులాంతర వివాహాలు చేసుకున్న ఐదు జంటలకు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.50 లక్షల బాండ్‌లను అందించారు. ముగ్గురు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు,  అసంఘటిత రంగాల కింద నమోదైన కార్మికులకు ఈ-శ్రమ్‌ కార్డులను అందజేశారు. 

 చిన్నారుల ప్రదర్శన 

బాల్య వివాహాలతో చిన్న వయస్సులో జరిగే నష్టాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ చిన్నారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ అకట్టుకుంది. బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే 1098 సిబ్బంది వచ్చి వివాహాలు ఆపడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటివి ప్రదర్శించారు. 

Updated Date - 2021-10-24T06:40:20+05:30 IST