ఉత్సాహంగా రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-17T05:10:45+05:30 IST

ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను కల్యాణమాడిన లక్ష్మీనరసింహుడు తన దేవేరులతో కలిసి సోమవారం నరసింహపురంలో రథం ఎక్కి ఊరేగారు.

ఉత్సాహంగా రథోత్సవం
నరసింహపురంలోని లక్ష్మీనరసింహుడి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు (ఇన్‌సెట్‌లో) ఉత్సవ మూర్తులు

నరసింహపురంలో ఊరేగిన వేదగిరీశుడు 


నెల్లూరురూరల్‌, మే 16 : ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను కల్యాణమాడిన లక్ష్మీనరసింహుడు తన దేవేరులతో కలిసి సోమవారం నరసింహపురంలో రథం ఎక్కి ఊరేగారు. ఈ వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో వేదగిరి మారుమోగింది. గ్రామ దర్శనానికి ఆలయంలో సిద్ధమైన ఉత్సవర్లను పల్లకీలో ఊరేగింపుగా వేదగిరి నుంచి కిందకు తీసుకువచ్చి ఉభయకర్తలు అందించిన లాంఛనాలను రథంలో ఉంచి ముస్తాబు  చేశారు. అనంతరం భక్తకోటి సందడి నడుమ, గోవిందనామస్మరణలతో రథం ముందకు కదిలింది. గ్రామంలో నాలుగు వీధుల్లో రథాన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులు, అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఈవో గిరికృష్ణ, గ్రామ సర్పంచ్‌ వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, రాత్రి జరిగిన హుండీల లెక్కింపులో రూ.7,40,481 ఆదాయం వచ్చినట్లు చైర్మన్‌ సురేంద్రరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ చైతన్య, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:10:45+05:30 IST