జట్టులో చోటు కోసం రెండు వరుస సెంచరీలు సరిపోతాయనుకోవడం లేదు: ఉస్మాన్ ఖావాజా కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-08T23:45:26+05:30 IST

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ లెఫ్టాండర్ ఉస్మాన్ ఖావాజా

జట్టులో చోటు కోసం రెండు వరుస సెంచరీలు సరిపోతాయనుకోవడం లేదు: ఉస్మాన్ ఖావాజా కీలక వ్యాఖ్యలు

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ లెఫ్టాండర్ ఉస్మాన్ ఖావాజా సెంచరీలతో విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులు చేసిన ఖావాజా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఫలితంగా సిడ్నీ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ గ్రేట్ డగ్ వాల్టెర్స్, రికీ పాంటింగ్ సరసన చేరాడు.


నాలుగో రోజు మ్యాచ్ అనంతరం ఖావాజా మాట్లాడుతూ..  యాసెస్ సిరీస్ చివరి టెస్టులో తలపడే జట్టులో చోటుకు ఈ వరుస సెంచరీలు సరిపోతాయని తాను అనుకోవడం లేదన్నాడు. తాను ట్రావిస్ హెడ్ స్థానంలో జట్టులోకి వచ్చానని పేర్కొన్న ఖావాజా.. ఈ సిరీస్‌లో సెలక్టర్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నాడు. తాను రెండు వరుస సెంచరీలు చేసినంత మాత్రాన ఏదైనా భిన్నంగా జరుగుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు.


తనకు అవకాశం దక్కిందని, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. తనకింకా పరుగుల దాహం తీరలేదని, తానింకా పరుగులు చేయగలనని నిరూపించానని అన్నాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే కనుక ఇలాంటి ఆటతీరునే కనబరుస్తానని ఖావాజా చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-01-08T23:45:26+05:30 IST