రుచుల్లో ఉసిరి

ABN , First Publish Date - 2020-11-28T06:03:08+05:30 IST

ఉసిరికాయలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు

రుచుల్లో ఉసిరి

ఈ సీజన్‌లో ఉసిరి విరివిగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో 

ఉసిరిని మించింది లేదు. ఈ సమయంలో ఉసిరితో చట్నీ, మురబ్బా, 

కొబ్బరిని చేర్చి కర్రీ, పులిహోర, సబ్జీ, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాండీలు 

తయారుచేసుకోవచ్చు. మరి మీరూ ఈ రెసిపీలు ప్రయత్నించండి.


ఉసిరికాయలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 


వందగ్రాముల ఉసిరికాయలో... 

విటమిన్‌ సి - 478 గ్రా.

ఫైబర్‌ - 5 గ్రా.

క్యాలరీలు - 48

ప్రొటీన్‌ - 1గ్రా.

కార్బోహైడ్రేట్లు - 10గ్రా


ఉసిరికాయ సబ్జీ


కావలసినవి

ఉసిరికాయలు - ఒక కప్పు(గింజలు తీసేసి, చిన్నగా కట్‌ చేసినవి), ఆవాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఆవాల నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట. 


తయారీ

  • ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై వేగించాలి.
  • కాసేపు వేగిన తరువాత ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి.
  • కారం, పసుపు, సోంపు, ధనియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
  • తరువాత అరకప్పు నీళ్లు పోసి, బెల్లం వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. 
  • చివరగా కొత్తిమీర వేసుకుని దింపాలి. అన్నంలోకి లేదా చపాతీలోకి ఈ సబ్జీ రుచిగా ఉంటుంది.

పులిహోర


కావలసినవి

బియ్యం - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉసిరికాయ ముక్కలు - అరకప్పు, ఇంగువ - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - ఐదు, పచ్చిమిర్చి - ఐదు, కరివేపాకు - కొద్దిగా, మినప్పప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌,  పసుపు - పావు టీస్పూన్‌, వేరుసెనగలు - కొద్దిగా.


తయారీ విధానం

  • ముందుగా అన్న వండి సిద్ధంగా పెట్టుకోవాలి.
  • స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, వేరుసెనగలు వేసి వేగించాలి.
  • తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కలపాలి.
  • ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు వేగించాలి. 
  • వండి పెట్టుకున్న అన్నం వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేయాలి.
  • చిన్నమంటపై మరో రెండు మూడు నిమిషాలు ఉంచిన తరువాత దింపి, సర్వ్‌ చేసుకోవాలి. పుల్లపుల్లగా ఉండే ఉసిరి పులిహోర రుచిని అందరూ ఇష్టపడతారు.

క్యాండీ


కావలసినవి

ఉసిరికాయలు - అర కేజీ, పంచదార - పావు కేజీ. 


తయారీ

  • ముందుగా స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి కొద్దిగా నీళ్లు పోసి, పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి.
  • ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆ ఉసిరికాయ ముక్కలను పంచదార పానకం వేసి కొద్దిసేపు మరగనివ్వాలి.
  • తరువాత ఉసిరికాయ ముక్కలను పంచదార పానకంలో నుంచి వడకట్టి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • ఆ ఉసిరికాయ ముక్కలపై కొద్దిగా పంచదార చల్లుకుని మూడు రోజుల పాటు ఎండలో పెట్టాలి.
  • ఇలా తయారుచేసుకున్న క్యాండీలు మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.

ఉసిరి కొబ్బరి కర్రీ


కావలసినవి

ఉసిరికాయలు - ఆరు, పచ్చి కొబ్బరి - అరకప్పు, గసగసాలు - మూడు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, తరిగిన అల్లం - కొద్దిగా, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - తగినంత, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం

  • ముందుగా ఉసిరికాయలను నూనెలో మగ్గపెట్టుకోవాలి. తరువాత గింజలు తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
  • పచ్చికొబ్బరి, గసగసాలను కలిపి పేస్టులా చేసుకోవాలి.
  • స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. 
  • ఇప్పుడు పచ్చికొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • కొంచెం పసుపు, తగినంత కారం వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకోవాలి.
  • మిశ్రమం మరుగుతున్న సమయంలో ఉసిరికాయ ముక్కలు వేయాలి.
  • కాసేపు వేగించుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

మురబ్బా


కావలసినవి

ఉసిరికాయలు - వంద గ్రాములు, పంచదార - ఒకకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వేగించిన జీడిపప్పు - ఐదారు పలుకులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు. 


తయారీ విధానం

  • ముందుగా ఉసిరికాయలను కట్‌ చేసి గింజలు తీసేసి పేస్టు చేసుకోవాలి.
  • తరువాత నెయ్యిలో వేగించి పక్కన పెట్టుకోవాలి.
  • మరొక పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి, పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని పానకం దగ్గరకి అయ్యాక కార్న్‌ఫ్లోర్‌ వేయాలి. 
  • ఇప్పుడు నెయ్యిలో వేగించి పెట్టుకున్న ఉసిరికాయ పేస్టు వేసి కలపాలి.
  • కొద్దిగా నెయ్యి వేసి మరికాసేపు వేగించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

ఉసిరి  చట్నీ


కావలసినవి

ఉసిరికాయలు - ఒక కప్పు, నూనె - సరిపడా, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

  • ముందుగా ఉసిరికాయలను ఉడికించి, విత్తనాలు తీసేయాలి. తరువాత ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి వేగించాలి.
  • తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి.
  • ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి
  • తగినంత ఉప్పు వేసి కలుపుకొని స్టవ్‌పై నుంచి దింపాలి. 
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకుంటే టేస్టీ  ఉసిరికాయ చట్నీ రెడీ.

ఉసిరికాయ అచార్‌


కావలసినవి

ఉసిరికాయలు - ఒక కేజీ, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఇంగువ - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాల నూనె - పావుకేజీ.


తయారీ విధానం

  • ముందుగా ఉసిరికాయలను పావుగంట పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
  • స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, కారం వేసి వేగించాలి. 
  • ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి, తగినంత ఉప్పు వేసుకుని కలపాలి.
  • ఉసిరికాయలకు మసాలా బాగా పట్టే వరకు వేగించి దింపుకోవాలి.
  • ఈ ఉసిరికాయ అచార్‌ను జార్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది.

Updated Date - 2020-11-28T06:03:08+05:30 IST