ధ్యాన్‌చంద్‌ అవార్డుకు అంతర్జాతీయ బాక్సర్‌ ఉష

ABN , First Publish Date - 2020-06-04T09:11:33+05:30 IST

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించనున్న ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్‌ అవార్డుకు నగరానికి ..

ధ్యాన్‌చంద్‌ అవార్డుకు అంతర్జాతీయ బాక్సర్‌ ఉష

భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రతిపాదన


విశాఖపట్నం(స్పోర్ట్సు), జూన్‌ 3: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించనున్న ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్‌ అవార్డుకు నగరానికి చెందిన అంతర్జాతీయ బాక్సర్‌, కోచ్‌ నగిశెట్టి ఉష పేరును ప్రతిపాదిస్తూ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాజీవ్‌ ఖేల్‌ రత్న పురస్కారానికి ఇద్దరు, అర్జున అవార్డుకు ముగ్గురు, ద్రోణాచార్య అవార్డుకు ఇద్దరిని ప్రతిపాదించిన బాక్సింగ్‌ ఫెడరేషన్‌, ధ్యాన్‌చంద్‌ అవార్డుకు ఉష పేరును మాత్రమే ప్రతిపాదించడం విశేషం. తూర్పుకోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ ఉద్యోగి ఉష, బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.


ఎస్‌బీసీ ఏషియన్‌ వుమెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో స్వర్ణ పతకం, ఏఐబీఏ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌, నాల్గవ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌, వియత్నంలో జరిగిన మూడవ ఏషియన్‌ ఇండోర్‌ గేమ్స్‌ బాక్సింగ్‌లో కాంస్య పతకాలు సాధించారు. 2013లో కోచ్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఉష, ఇండియన్‌ రైల్వే సీనియర్‌ వుమెన్‌ బాక్సింగ్‌ జట్టుకు నాలుగేళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా పలు జాతీయ బాక్సింగ్‌ టోర్నీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ మహిళా బాక్సింగ్‌ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2020-06-04T09:11:33+05:30 IST