నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-07-19T23:13:28+05:30 IST

నువ్వుల్లో పోషక విలువలు తెలియజేయండి.

నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆంధ్రజ్యోతి(19-07-2020)

ప్రశ్న: నువ్వుల్లో పోషక విలువలు తెలియజేయండి. ?


- యాదయ్య, మిర్యాలగూడ

 

డాక్టర్ సమాధానం: నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని రుచి కొరకే కాక ఔషధ విలువల కోసం కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం అన్నది అనాదిగా వస్తున్నదే. ముప్ఫయి గ్రాముల నువ్వులు 3. గ్రాముల పీచు పదార్ధాన్ని అందిస్తాయి. ఆహారం ద్వారా అందే పీచు పదార్ధాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాక గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మొదలైనవాటిని దూరంగా ఉంచుతాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. నువ్వుల్లో  అధిక శాతం ఉండే అన్‌ సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ లిగ్నాన్స్‌ ఫైటోస్టెరాల్స్‌ మొదలైన వాటివలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడం, అధిక ట్రై గ్లిసెరైడ్స్‌ అదుపులోకి రావడం మొదలైన ప్రయోజనాలు కూడా నువ్వులు తినడం వలన చేకూరుతాయి. నువ్వుల్లోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఈ మొదలైనవి అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు కూడా సహకరిస్తాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం కూడా ఎక్కువే. ఐరన్‌, కాపర్‌, సెలీనియం, మాంగనీసు వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉండే నువ్వులు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచివే. నూనె తొలగించిన నువ్వు పప్పు లేదా తెలగ పిండిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. అందువలన ఎదిగే పిల్లలకు, బాలింతలకు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి తెలగ పిండి మంచి ఆహారం. నువ్వుల్లోని ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో మెనోపాజ్‌ లక్షణాలను కొంత వరకు నియంత్రిస్తాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇన్ని ఉపయోగాలున్నటువంటి నువ్వులను పొడి చేసి కూరల్లో చల్లుకోవడం, కొద్దిగా బెల్లంతో కలిపి లడ్డులా తీసుకోవడం, తాలింపులో, రోటి పచ్చళ్లలో వాడడం ఇలా రకరకాలుగా ఆహారంలో భాగం చేసుకుంటే అందరికీ మంచిదే. అయితే అధిక క్యాలోరీలు కూడా ఉంటాయి కాబట్టి రోజుకు పదిహేను గ్రాములకు మించకుండా మాత్రమే నువ్వులను తీసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-07-19T23:13:28+05:30 IST