బెల్లంతో ప్రయోజలెన్నో!

ABN , First Publish Date - 2020-02-22T22:53:57+05:30 IST

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్ళు, ఆరోగ్యం, నైవేద్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాల్లో బెల్లానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అతిపెద్ద బెల్లం మార్కెట్‌

బెల్లంతో ప్రయోజలెన్నో!

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్ళు, ఆరోగ్యం, నైవేద్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాల్లో బెల్లానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అతిపెద్ద బెల్లం మార్కెట్‌ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌ కాగా, రెండో అతిపెద్ద మార్కెట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి కావడం ఇందుకు నిదర్శనం. పంచదారతో పోలిస్తే ఎటువంటి రసాయనాలు లేకుండా తయారయ్యే బెల్లం వల్ల ఏఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం


బెల్లాన్ని చెరకు గడల నుంచి తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి కూడా రసాన్ని సేకరించి బెల్లం తయారు చేస్తారు. తయారీలో ఎటువంటి రసాయనాలు వాడరు. పంచదారలో అధిక క్యాలరీలు అందించే తీపి మాత్రమే ఉంటుంది. తక్కువ క్యాలరీలు అందించే బెల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అందువల్ల పంచదారతో పోలిస్తే బెల్లాన్ని వినియోగించడమే ప్రయోజనకరమంటున్నారు నిపుణులు.


మన సంప్రదాయంలోనే ఉంది

బెల్లం వినియోగం భారతీయుల సంప్రదాయంలో మిళితమైంది. దేవతలకు ప్రసాదాల తయారీలో బెల్లం వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. తెలుగువారి పండుగల్లో బెల్లంతో చేసిన పదార్థాలు ఉండి తీరాల్సిందే. సంక్రాంతి పండుగకు బెల్లంతో చేసే అరిసెలు ప్రామాణిక వంటకం. కొత్త పంట చేతికి రాగానే చేసే తొలి వంటకం పొంగలితోనే నివేదన చేస్తారు. శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణంలో బెల్లం పానకం తయారు చేసి ప్రసాదంగా పంచిపెడతారు. శివరాత్రి ఉత్సవాల్లో బెల్లపుబూందీ ప్రసాదానికే పెద్దపీట. గణపతి నవరాత్రుల్లో పానకం, పాయసం, దేవీ నవరాత్రుల్లో పరమాన్నం బెల్లంతో చేసేవే. దీపావళి మిఠాయి కోసం కొబ్బరి తురుముతో లౌజులు, గోధుమ పిండి హల్వా తయారీలో కూడా దీనిని వినియోగిస్తారు. అన్ని శుభకార్యాల్లో బెల్లం జిలేబీలు ఉండాల్సిందే. తిరుమలలో వెంకన్న నిత్య కైంకర్యాలలో ఉండే పొంగలి బెల్లంతో చేసేదే. లక్షలాదిమంది భక్తులు వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో అమ్మవార్లకు  సమర్పించే ‘బంగారం’ బెల్లమే.


మేలైన ప్రత్యామ్నాయం

మధుమేహం ఉన్నవారు పంచదారకు ప్రత్యామ్నాయంగా స్టెవియా (తీపి ఆకు), షుగర్‌–ఫ్రీ బిళ్ళలను వాడతారు. మధుమేహం లేని వారికి ఉత్తమ ప్రత్యామ్నాయం బెల్లం. కాఫీ/టీ ప్రియులు ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ/టీతో దిన చర్యను ప్రారంభిస్తారు. అధిక తీపి/పంచదార వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెరగడంతో చాలామంది మరోసారి  కాఫీ/టీ తాగాలనిపించినా వెనకడుగు వేస్తున్నారు. ఇళ్ళు, హోటళ్ళలో అన్నిచోట్లా పంచదార వినియోగమే ఎక్కువ. దీంతో ఎక్కువ సార్లు తీయగా కాఫీ/టీ తాగితే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. కప్పు కాఫీ/టీలో పంచదారకు బదులు చిన్న బెల్లంముక్క వేసుకుంటే ఆ బెడద ఉండదు. టీలో అల్లం, బెల్లం రెండూ కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ జలుబు, అలర్జీలకు దూరంగా ఉంచుతుంది.


రక్తహీనత రానివ్వదు

బెల్లంలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. రక్తకణాలకు ఆక్సీజన్‌ సరఫరా చేసే హీమోగ్లోబిన్‌లో ఐరన్‌ పాత్ర కీలకం. రోజూ క్రమం తప్పకుండా బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎర్ర రక్తకాణాల ఐరన్‌ అందుతుంది. దీంతో ఊపిరితిత్తుల నుంచి దేహం మొత్తానికి ఎర్ర రక్తకణాల ద్వారా ఆక్సీజన్‌ అందడానికి దోహదపడుతుంది. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి బెల్లం వల్ల అధిక ప్రయోజనం చేకూరుతుంది. 


జీర్ణవ్యవస్థకు బలం

జీర్ణవ్యవస్థపై బెల్లం సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే బెల్లం వేసిన టీ తాగినట్లయితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బెల్లంలో ఉండే పలు ఖనిజాల వల్ల శీతాకాలంలో శరీరంలో వెచ్చదనం పెరిగేలా చేస్తుంది.


పోషకాల గని

బెల్లంలో అధిక పోషకాలు ఉంటాయి. దీంతో ఆరోగ్యపరంగా చూసినా పంచదార కన్నా బెల్లమే ఉత్తమం. బెల్లంలో అనేక విటమిన్లు ఫాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటవల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో కలిగే ముప్పు నుంచి రక్షణ ఏర్పడుతుంది. త్వరగా వృద్ధాప్యం రావడానికి ఫ్రీ రాడికల్సే కారణం. దేహాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం మేలైన డి–టాక్సిన్‌గా పనిచేస్తుంది. దీంట్లో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా టాక్సిన్లను వెలుపలకు పోయేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. 


బరువు తగ్గిస్తుంది

నిత్యం తగిన పరిమాణంలో బెల్లం ఆహారం ద్వారా తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నాలు సులభతరం అవుతాయి. పొట్ట ప్రాంతంలో అదనపు కిలోలను కరిగించడం తేలికవుతుంది. మెటబాలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి సహాయ ఎంజైములను బెల్లం ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం మెరుగ్గా, వేగంగా జీర్ణమవుతుంది. అందువల్ల కొందరు భోజనం చేసిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాన్ని తినడానికి ఆసక్తి కనబరుస్తారు.


కేకుల తయారీలో

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చెఫ్‌లు (పాకశాస్త్ర నిపుణులు) సైతం బెల్లంతో చేసే డిజర్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. లిక్విడ్‌ గోల్డ్‌ (ద్రవరూపంలోని బంగారం) అని ముద్దుగా పిలుచుకునే బెల్లం ఎటువంటి రసాయనాలు లేని శుద్ధమైన తీపి పదార్థమని వారు పేర్కొంటారు. కమ్మటి సువాసన, కంటికి ఇంపైన బంగారు రంగు కలిగిన బెల్లంతో తయారు చేసిన కేకులు, మిఠాయిలు మనసుకు హాయినిస్తాయని వారు చెబుతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాస్‌లు, గ్లేజ్‌లు, జామ్‌లు, కేక్‌లు, స్వీట్లను బెల్లంతో చేస్తారు. తాటి బెల్లంతో చేసే గోధుమ కేక్‌, నోటిలో వేసుకోగానే కరిగిపోయే కారుపట్టి హల్వా, సీజనల్‌ పండ్లతో చేసే పేల్‌ ఆలే, గుడ్‌ కి ఖీర్‌ వంటివి చెఫ్‌లు ఎంపిక చేసిన జాబితాలో కొన్ని ఐటెమ్‌ల పేర్లు. బెల్లాన్ని సన్నగా తురిమి నీటిలో కరిగించి సిరప్‌గా తయారు చేస్తారు. ఆ సిరప్‌ను కస్టర్డ్‌లు, రైస్‌, ఐస్‌క్రీమ్‌లపై పోసి అందిస్తారు. బంగారు రంగులో మెరిసిపోయే ఆ సిరప్‌ రుచిలోనూ అమోఘం. 


మహిళలకు మేలు

రోజూ ఆహారంలో బెల్లం ఉండేలా చూసుకుంటే మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారి ఆహారంలో బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతుంది.  రుతుక్రమంలో వచ్చే చికాకులు, కడుపునొప్పి బెల్లంతో దూరమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.


ఆయుర్వేదంలో

పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాల తయారీలో బెల్లాన్ని వినియోగిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి దీనిని సిఫార్సు చేయరు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, పార్శనొప్పి (మైగ్రేన్‌), ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు వివిధ మూలికల్లో బెల్లం ఉపయోగించి చేసిన ఔషధాలను రూపొందిస్తారు. 


మధుమేహం ఉంటే

మధుమేహం సమస్య ఉన్నవారికి పంచదార మాదిరిగానే బెల్లం ప్రభావం కూడా ఉంటుంది. అయితే దేహంలో బెల్లం పూర్తిగా శోషితం (ఇంకడానికి) పంచదార కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఒక టీస్పూన్‌ పంచదార ద్వారా 60 క్యాలరీలు లభిస్తే అదే పరిమాణం ఉన్న బెల్లం ద్వారా 27 క్యాలరీలు వస్తాయి. బెల్లంలో 70 శాతం సూక్రోజు, 10 శాతం గ్లూకోజు, ఫ్రక్టోజు ఉంటాయి. పంచదారలో 50 శాతం ఫ్రక్టోజు ఉంటుంది. అందువల్ల నూట్రిషనిస్టులు పంచదార వాడకం సరైనదికాదని చెబుతారు.  అధిక పంచదార వినియోగం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వస్తాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ కూడా హెచ్చరిస్తోంది. పంచదార ద్వారా కేవలం క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. అయితే బెల్లం తయారీలో రసాయనాల వినియోగం లేనందున విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. పంచదారతో పోల్చితే బెల్లం నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయినా, మధుమేహులు బెల్లంతో చేసిన పదార్థాలను పరిమితంగానే తినాలి.


పిల్లల విషయంలో

గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) ప్రకారం పంచదార కన్నా బెల్లమే మేలు. జీఐ సంఖ్య ఒక  ఆ ఆహారం ఎంత త్వరగా జీర్ణమై దేహంలో గ్లూకోజ్‌గా మారుతుందో సూచిస్తుంది. అంటే ఆ ఆహారం ఎంత వేగంగా రక్తంలో గూకోజ్‌ను పెంచుతుందో తెలియజేస్తుంది. ఏదైనా ఆహార సూచీ (జీఐ) తక్కువగా ఉంటే ఆ ఆహారం జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది.  ఫలితంగా రక్తంలో షుగర్‌ నెమ్మదిగా పెరుగుతుంది. అధిక జీఐ సంఖ్య ఉన్న అధిక జీఐ ఉన్న ఆహారం త్వరగా జీర్ణమై, రక్తంలో షుగర్‌ స్థాయులు వేగంగా పెంచుతాయి. సాధారణంగా జీఐ 55 కన్నా తక్కువగా ఉంటే అది మంచిది, ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతారు. జీఐ 70 కన్నా ఎక్కువగా ఉన్న ఆహారం అనారోగ్యకరమైనదని పరిగణిస్తారు. ఎందుకంటే అధిక జీఐ ఉండే ఆహారం రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని వేగంగా పెంచి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. బెల్లం గ్లైసిమిక్‌ సూచీ 80 కాగా పంచదార సూచీ 105 వరకూ ఉంటుంది. అందువల్ల పిల్లలు ఇష్టపడే కేకులు, మిఠాయిలు, చాక్లెట్ల విషయంలో  పంచదారతో చేసిన వాటి కన్నా బెల్లంతో చేసిన వాటికి ప్రాధానం ఇవ్వడం మేలు. బెల్లపు   పాకంతో చేసే మరమరాల ఉండలు, వేరుశనకపప్పు ఉండలు, జీడిపప్పు ఉండలతో అటు రుచికి రుచి, ఇటు దేహానికి బలం కూడా. 


బెల్లంలో రకాలు

చెరకు రసం నుంచి ఎటువంటి శుద్ధి ప్రక్రియలు లేకుండా తయారు చేసేది బెల్లం ప్రధానమైనది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాలలో ఖర్జూరం, తాటి చెట్లు, కొబ్బరి నుంచి కూడా బెల్లం తయార చేస్తారు. ఫ్యాక్టరీలో తయారయ్యే తేనెతో పోలిస్తే బెల్లమే ఉత్తమం. తయారీలో కొన్ని నూట్రియంట్లను కోల్పోవడం ఫ్యాక్టరీ తేనె ఆనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. శుద్ధమైన బెల్లాన్ని గుర్తించడంలో దాని రంగు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నికార్సయిన బెల్లం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కొద్దిగా పారదర్శంగా ఉండి స్ఫటికాల్లాగా (క్రిస్టల్స్‌ మాదిరిగా) మెరుస్తూ ఉన్నట్లయితే తీపికోసం ఇతర విధానాలను అనుసరించారని అర్థం చేసుకోవచ్చు. పసుపు రంగులో ఉన్నట్లయితే బెల్లం తయారీలో రసాయనాలు వినియోగించారనడానికి నిదర్శనం.


నిడుమోలు వసుధ


Updated Date - 2020-02-22T22:53:57+05:30 IST