Abn logo
Sep 21 2021 @ 02:16AM

యూజర్‌ చార్జీలు మెరుగ్గా వసూలు చేసే వలంటీర్లకు 5 శాతం బోనస్‌

లక్ష్మీపురం కూడలి విస్తరణకు ఓకే 

 స్టాండింగ్‌ కమిటీలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం 


తిరుపతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని 102 సచివాలయాల్లో పనిచేసే వలంటీర్లకుకార్పొరేషన్‌ స్పెషల్‌ బోనస్‌ ప్రకటించింది. తడి, పొడి చెత్త సేకరణతో పాటు ప్రజలనుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడంలో మెరుగైన ఫలితాలు చూపించినవారికి వసూలు చేసిన మొత్తంలో 5 శాతం ప్రోత్సాహకంగా అందించేందుకు కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. మేయరు శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ సోమవారం సమావేశమై తిరుపతిలో చేపట్టబోవు పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిషనర్‌ గిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కమిటీ సభ్యులు ఎస్‌కే బాబు, నరసింహాచారి, ఉమాఅజయ్‌, రామస్వామి వెంకటేశ్వర్లు, గణేష్‌, ఎంఈలు చంద్రశేఖర్‌, వెంకట్రామిరెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరికృష్ణ, సెక్రటరీ రామచంద్ర, మేనేజర్‌ హాసిమ్‌, ఆర్వోలు సేతుమాధవ్‌, గాలి సుధాకర్‌ పాల్గొన్నారు. 

- తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు కూడలి పక్కనే ఉన్న వినాయకస్వామి గుడి వెనుక వైపున అదనపు రోడ్డును నిర్మించి తిరుచానూరు రోడ్డుకు కలిపితే ఎయిర్‌ బైపా్‌సరోడ్డు ట్రాఫిక్‌ సమస్యను తగ్గించవచ్చని కమిటీ అభిప్రాయపడి ఆమోదం తెలిపింది. 

- స్టాండింగ్‌ కౌన్సిల్‌గా మూడేళ్ల కాలపరిమితితో నియమితులైన అడ్వకేట్‌ ఐ.చంద్రశేఖర్‌రెడ్డికి వేతనం నెలకు రూ.15వేలు ఇచ్చేందుకు ఆమోదం. 

- చెన్నారెడ్డికాలనీ శ్మశాన వాటికలో రూ.14 లక్షలతో దహనక్రియల భవన నిర్మాణం, రూ.48.6లక్షలతో కృష్ణమనాయుడు కొలను పునరుద్ధరణలో ప్రహరిగోడ, రేకులషెడ్‌, మౌళికసదుపాయాల కల్పన. 

-  44 పాఠశాలల్లో అదనంగా 16మంది స్వీపర్లు, 22 మంది వాచ్‌మెన్‌ నియామకం. 

- చెన్నారెడ్డి కాలనీలోని పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు 

- ఇందిరానగర్‌ ప్రాథమిక  పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఉన్నత అధికారులకు లేఖ.

-  రూ.24.5లక్షలతో ఇందిరామైదానంలో గ్యాలరీ నిర్మాణం.

- మృతదేహం తరలించేటప్పుడు టపాసులు కాల్చినా, పూలు చల్లినా రూ.10వేలు జరిమానా విఽధించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.