‘గాంధీ’లో కుప్పలుగా వాడేసిన పీపీఈ కిట్లు

ABN , First Publish Date - 2020-08-02T08:32:40+05:30 IST

వైద్యులు, సిబ్బంది, రోగులు వాడిపడేసిన పీపీఈ కిట్లు గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని

‘గాంధీ’లో కుప్పలుగా వాడేసిన పీపీఈ కిట్లు

  • నెల రోజులుగా తొలగించని వైనం
  • దుర్వాసనతో వైద్యులు, రోగులకు నరకం

అడ్డగుట్ట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది, రోగులు వాడిపడేసిన పీపీఈ కిట్లు గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని పద్మారావునగర్‌ వాసులు విలవిల్లాడుతున్నారు. కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వైద్య సిబ్బందితో పాటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గాంధీలో వెయ్యి మంది పైగా కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు ఉపయోగించిన కిట్లు రోజుకు 2 వేలకు పైగానే ఉంటున్నాయి.  నెలకు 60 వేల కిట్లు చెత్తకుండీలో వేయాలి. అయితే.. ఆవరణలో ఉన్న ఓ చిన్న రేకుల గది వద్ద ఉంచుతున్నారు. వాడి పడేసిన పీపీఈ కిట్లను రాంకీ సంస్థ సిబ్బంది ఏ రోజుకారోజు తీసుకెళ్లాలి.


కానీ వారు నెల రోజులుగా పట్టించుకోవడం లేదు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంకీ సంస్థతో మాట్లాడాల్సిన బాధ్యత ఆస్పత్రి ఆర్‌ఎంఓలపై ఉంటుంది. కానీ.. వాళ్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ కిట్లను చెత్తకుండీలో పారేసే తంతు కూడా ఓ యజ్ఞంలా మారింది. వందల కొద్దీ కిట్లను సిబ్బంది రోజూ చేతులతో ముట్టుకుని ట్రాలీలో వేసుకుని బయటపడేయాల్సి వస్తోంది. ఆస్పత్రి నుంచి చెత్తకుండీ వరకు తీసుకెళ్లడానికి అరగంట  పడుతోంది. దీంతో సిబ్బంది సహనం కోల్పోతున్నారు.

Updated Date - 2020-08-02T08:32:40+05:30 IST