సమ్మర్‌.. పవర్‌

ABN , First Publish Date - 2022-05-01T06:10:04+05:30 IST

సమ్మర్‌.. పవర్‌

సమ్మర్‌.. పవర్‌

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెరిగిన విద్యుత్‌ వినియోగం

జనవరి ఆఖరు నుంచి ఎండలు మండటమే కారణం

విద్యుత్‌ వినియోగంలో గుడివాడ టాప్‌

చివరి స్థానంలో ఉయ్యూరు

జూన్‌ ఆఖరు నుంచి తగ్గే అవకాశం


ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెడితే నిప్పులకుంపటి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అల్లాడిపోతున్న జనం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు విశ్రాంతి ఇవ్వట్లేదు. వేసవి తాపాన్ని తట్టుకోలేని జిల్లావాసులు చల్లదనం కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకు విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పవర్‌ వినియోగం పైపైకి చేరింది.


(ఆంధ్రజ్యోతి- విజయవాడ) : జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగి పోతోంది. జిల్లావాసులకు కేటాయించిన మిలియన్‌ యూనిట్లను దాదాపు వాడేస్తున్నారు. విద్యుత్‌ వినియోగంలో గుడివాడ టాప్‌లో ఉండగా, ఉయ్యూరు చివర్లో ఉంది. జనవరి నెలాఖరులోనే ఎండలు మండిపోవడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. జిల్లాకు ఫిబ్రవరిలో 496.92 మిలియన్‌ యూనిట్లను కోటాగా ఇవ్వగా, 450.00 మిలియన్‌ యూనిట్లను వినియోగించుకున్నారు. ఇక మార్చి కోటా 555.940 మిలియన్‌ యూనిట్లు ఉండగా, వినియోగం 574.793 మిలియన్‌ యూనిట్లకు పెంచారు. ఏప్రిల్‌లో 555.940 మిలియన్‌ యూనిట్లను కేటాయించగా, 554.426 మిలియన్‌ యూనిట్లను ఉపయోగించారు.మేలో మరింత పెరుగుతుందని విద్యుత్‌ శాఖ అధికారుల అంచనా. 

టాప్‌ లేపుతున్న గుడివాడ

ఉమ్మడి కృష్ణాజిల్లాలో విద్యుత్‌ వినియోగంలో గుడివాడ ముందు వరుసలో ఉండగా, ఉయ్యూరు చివర్లో ఉంది. జిల్లాలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి. విజయవాడ టౌన్‌, గుణదల, విజయవాడ రూరల్‌, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, ఉయ్యూరు డివిజన్లకు నెలవారీగా యూనిట్ల కేటాయింపు ఉంటుంది. ఇలా కేటాయించిన యూనిట్లను గుడివాడ ప్రజానీకం ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉయ్యూరు డివిజన్‌  వినియోగం మాత్రం తక్కువగా ఉంటోంది. గడిచిన ఏడాది ఫిబ్రవరిలో గుడివాడ డివిజన్‌కు 113.619 మిలియన్‌ యూనిట్లు కేటాయించగా, 95.948 మిలియన్‌ యూనిట్లను వినియోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 102.782 మిలియన్‌ యూనిట్లను కోటాగా కేటాయించగా, 115.486 మిలియన్‌ యూనిట్లను వినియోగించారు. గుడివాడ డివిజన్‌లో ఆక్వా సాగు, పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్లే ఈస్థాయిలో వినియోగం జరుగుతోందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉయ్యూరు డివిజన్‌కు గత ఏడాది ఫిబ్రవరిలో 29.835 మిలియన్‌ యూనిట్లను కేటాయించగా, 25.501 మిలియన్‌ యూనిట్లను ఉపయోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 35.491 మిలియన్‌ యూనిట్లను కేటాయించగా, 21.227 మిలియన్‌ యూనిట్లను వినియోగించారు.

ఈ ఏడాది డివిజన్ల లెక్కలు ఇలా..

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ డివిజన్‌కు కోటా 96.189 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 65.798 వినియోగించారు. గుణదలకు 89.293 మిలియన్‌ యూనిట్ల కోటా ఇవ్వగా, 66.050 వినియోగించారు. విజయవాడ రూరల్‌ డివిజన్‌కు 61.487 మిలియన్‌ యూనిట్లు కేటాయించగా, 55.746 ఉపయోగించారు. నూజివీడు డివిజన్‌కు కేటాయింపు 51.594 మిలియన్‌ యూనిట్లు ఇవ్వగా, వినియోగం 79.076గా ఉంది. మచిలీపట్నం డివిజన్‌కు 60.085 మిలియన్‌ యూనిట్లను కేటాయించారు. అందులో 46.620 వాడారు. మార్చిలో విజయవాడ టౌన్‌ డివిజన్‌కు 107.613 మిలియన్‌ యూనిట్లు కేటాయించగా, వినియోగం 81.632గా ఉంది. గుణదల డివిజన్‌కు కేటాయింపు 99.898 మిలియన్‌ యూనిట్లు కాగా, వినియోగం 80.009గా లెక్కలు చెబుతున్నాయి. విజయవాడ రూరల్‌కు 68.790 మిలియన్‌ యూనిట్లను కేటాయించగా, వినియోగం 72.329 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. నూజివీడు డివిజన్‌కు కేటాయింపు 57.722 మిలియన్‌ యూనిట్లు ఉండగా, వినియోగం 136.035గా నమోదైంది. మచిలీపట్నం డివిజన్‌కు కేటాయింపు 67.221 మిలియన్‌ యూనిట్లు కాగా, వినియోగం 53.900. ఏప్రిల్‌లో విజయవాడ టౌన్‌ డివిజన్‌కు 107.613, గుణదలకు 99.898, విజయవాడ రూరల్‌కు 68.790, నూజివీడుకు 57.722, మచిలీపట్నానికి 67.221 మిలియన్‌ యూనిట్లను కేటాయించారు. ఇందులో విజయవాడ టౌన్‌ 103.652, గుణదల 92.377, విజయవాడ రూరల్‌ 78.292, నూజివీడు 73.793, మచిలీపట్నం 63.781 మిలియన్‌ యూనిట్లను ఉపయోగించాయి. 





Updated Date - 2022-05-01T06:10:04+05:30 IST