Cars24 : సరిగా పనిచేయట్లేదని 600 మందికి ఉద్వాసన!

ABN , First Publish Date - 2022-05-19T23:05:50+05:30 IST

సెకండ్ హ్యాండ్ కార్ల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 సర్వీసెస్ లిమిటెడ్(Cars24 services limited) షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Cars24 : సరిగా పనిచేయట్లేదని 600 మందికి ఉద్వాసన!

ముంబై : సెకండ్ హ్యాండ్ కార్ల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 సర్వీసెస్ లిమిటెడ్(Cars24 services limited) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సరిగా పనిచేయడంలేదనే కారణం చూపుతూ ఉద్యోగం మానేయాలని 600 మంది సిబ్బందిని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారాన్ని చేరవేసినట్టు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 


ఈ రిపోర్టులపై కార్స్24 ప్రతినిధి స్పందించారు. ప్రదర్శన ఆధారిత తొలగింపులు వ్యాపారంలో సాధారణమేనని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల తొలగింపుగా ముద్రవేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అత్యధికులను జూనియర్ స్థానాలకు వెళ్లాలని కోరామని వివరించారు. ఇది నిధులకు సంబంధించిన సమస్య కాదు. వ్యాపారాన్ని  అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.  


కాగా 2015లో స్థాపించిన కార్స్24 సెకండ్ కార్ల ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం. ఇందులో వినియోగదారులు సెకండ్ హ్యాండ్ కార్లు కొనొచ్చు, అమ్మొచ్చు, ఫైనాన్స్ తీసుకోవచ్చు. కాగా తాజా తొలగింపునకు ముందు కంపెనీలో  మొత్తం 9 వేల మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈక్విటీ రూపంలో 300 మిలియన్ డాలర్లు సేకరించింది. అదనంగా మరో 100 మిలియన్ డాలర్లను కూడా సమీకరించింది. దీంతో కార్స్24 వ్యాల్యూయేషన్ దాదాపు 3.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ నిధులను అంతర్జాతీయ వ్యాపార విస్తరణ వేగాన్ని పెంచుతామని నిధుల సమీకరించిన సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కార్స్24కు సాఫ్ట్‌బ్యాంక్, ఆల్ఫా వేవ్ ఇన్నేవేషన్ వంటి భారీ ఇన్వెస్టర్ల మద్దతు ఉంది. 

Updated Date - 2022-05-19T23:05:50+05:30 IST