వలంటీర్ల వాడకం!

ABN , First Publish Date - 2021-04-15T09:18:41+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలోకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకోగా...

వలంటీర్ల వాడకం!

తిరుపతి ఉప ఎన్నికల్లో ‘అధికార’ సేవలు

ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ

సీఎం రాసిన లేఖ ప్రతులూ వారితోనే!

ప్రభుత్వ పథకాల లబ్ధిని వివరిస్తూ 

‘ఆపై మీ ఇష్టం’ అని హెచ్చరికలు

ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లతోనూ ప్రచారం

వలంటీర్లతో వైసీపీ నేతల రహస్య సమావేశాలు

చివరి 2 రోజులు ‘విలువైన’ బాధ్యతలు


అసలే అధికార పార్టీ! ఆపై... పూర్తిగా వారి అదుపులోనే వలంటీర్లు! వారినే వాడుకుందాం! తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచేద్దాం!.... ఇదీ వైసీపీ వ్యూహం! పోలింగ్‌ చివరి రెండు రోజుల్లో వారికి మరింత కీలకమైన, ‘విలువైన’ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం!


(తిరుపతి - ఆంధ్రజ్యోతి)

తిరుపతి ఉప ఎన్నికను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలోకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకోగా... ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని టీడీపీ కృషి చేస్తోంది. రోడ్‌షోలు, ప్రచార సభలతో టీడీపీ జోరుగా ప్రచారం చేస్తుండగా... ఆ స్థాయి సందడి వైసీపీలో బహిరంగంగా కనిపించడంలేదు. దీనికి కారణం... వలంటీర్ల వ్యవస్థ ద్వారా చాపకింద నీరులా ‘సమాంతర’ ప్రచారం సాగిస్తుండటమే అని తెలుస్తోంది. ‘మా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తాం’... అంటూ అధికార నేతలు బరి దాటుతున్నారు. పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించిన వలంటీర్ల ‘సేవల’ను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు.


ప్రత్యక్ష సూచనలు, పరోక్ష ఒత్తిళ్లతో వలంటీర్లు కూడా చాలాచోట్ల ఇంటింటికీ తిరిగి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకువేసి... వైసీపీ నేతలతో పాటే కండువాలు వేసుకుని, పార్టీ జెండాలు పట్టుకుని మరీ ప్రచారానికి వెళుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఏ పథకం నుంచి ఎంత లబ్ధి జరిగిందో వివరిస్తూ, వైసీపీకి ఓటేయకపోతే అన్నీ ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక అధికార పార్టీ నేతలు వలంటీర్లతో రహస్య సమావేశాలు జరుపుతూ ఎన్నికల్లో వారి పాత్రపై దిశానిర్దేశం చేస్తున్నారు. 


ఆపై మీ ఇష్టం... 

కరోనా కారణంగా ప్రచారానికి రాలేకపోతున్నానంటూ జగన్‌ రాసిన లేఖను ఇంటింటికీ వెళ్లి ఇచ్చే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. ‘‘చూడమ్మా జగన్‌ సార్‌ మీకు లేఖ రాశారు. ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని కోరారు. పథకాలన్నీ అలాగే ఉండాలంటే వైసీపీకి ఓటు వేయండి. లేదంటే అవి కట్‌ అయిపోతాయి. ఆపైన మీ ఇష్టం’’ అని సున్నితంగా హెచ్చరించి వెళ్లిపోతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వలంటీర్లు దాదాపుగా అందరూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పథకాల లబ్ధికి సంబంధించిన కరపత్రాలు పంచే బాధ్యతను అధికార పార్టీ నేతలు వారికే అప్పగించారు. ప్రతి వలంటీరు వద్ద 50నుంచీ వంద వరకూ కుటుంబాల వివరాలుంటాయి. ఫోన్‌ నంబర్లతోపాటు ఏ పథకం కింద ఎంత లబ్ధి చేకూరిందనే సమాచారమూ ఉంటుంది.


దీంతో ఓటర్లతో టచ్‌లోకి వెళ్లి... వైసీపీ తరఫున ప్రచారం చేయించే బాధ్యతను వారికే అప్పగించారు. ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకుంటున్న వలంటీర్లు ఏ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనకూడదు. ఈ నిబంధనను మెజారిటీ వలంటీర్లు పట్టించుకోవడం లేదు. ప్రచారానికి వెనుకంజ వేసే వలంటీర్లపై  వైసీపీ నాయకుల ఒత్తిడి తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. 


ఓటర్‌ స్లిప్పులతోపాటు కరపత్రాలు...

తిరుపతిలో ఓటరు స్లిప్పుల పంపిణీలో వలంటీర్లే ముఖ్యపాత్ర వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుతోపాటూ వైసీపీ కరపత్రం అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతూ ప్రచారంలో కనిపిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు వలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘ఇబ్బందులొస్తే మేం చూసుకుంటాం’ అని హామీ ఇస్తున్నారు. పార్టీ పట్ల విధేయత కొంత, తొలగింపు భయం కలగలిపి వలంటీర్లు అధికార పార్టీ సేవలో మునిగిపోయారు. ఉపాధి హామీ సిబ్బంది, రేషన్‌ డీలర్లపైనా ఒత్తిడి తెచ్చి ప్రచారంలోకి దించుతున్నారనే విమర్శలున్నాయి. 




అరకొరగానే చర్యలు...

చిత్తూరు జిల్లా బీఎన్‌ కండ్రిగ మండలంలో ప్రచారానికి వెళ్లిన వలంటీర్లపై స్థానికులు తిరగబడ్డారు. ప్రారంభంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సత్యవేడు లో ఇద్దరు, బీఎన్‌ కండ్రిగలో నలుగురు వలంటీర్లను అధికారులు తొలగించారు. ఈ నామమాత్రపు చర్యలు మినహా దాదాపు 90శాతం వలంటీర్లు వైసీపీ సేవలో మునిగి తేలుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.


సీఎం రాసిన లేఖల పంపిణీ పేరుతో ఓటర్లను బెదిరిస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఈ నెల 11న  వలంటీర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వలంటీర్లను అడ్డుకున్నారంటూ టీడీపీ కార్యకర్తలపైనే కేసు లు పెట్టి స్టేషన్‌లో కూర్చోబెట్టడం కొసమెరుపు!

Updated Date - 2021-04-15T09:18:41+05:30 IST