H-1B Visa: అమెరికా అనూహ్య నిర్ణయం.. మునుపెన్నడూ చూడని విధంగా..

ABN , First Publish Date - 2021-11-21T02:20:04+05:30 IST

అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మునుపెన్నడూ చూడని విధంగా హెచ్-1బీ వీసా లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 19న మూడోసారి లాటరీ తీసింది. ఈ అక్టోబర్ 1తో మొదలైన ఆర్థిక సంవత్సరంలో వీసాల కోటా పూర్తి చేసుకునేందుకు అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ మరోసారి లాటరీ నిర్వహించింది.

H-1B Visa: అమెరికా అనూహ్య నిర్ణయం.. మునుపెన్నడూ చూడని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మునుపెన్నడూ చూడని విధంగా హెచ్-1బీ వీసా లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 19న మూడోసారి లాటరీ తీసింది. ఈ అక్టోబర్ 1తో మొదలైన ఆర్థిక సంవత్సరంలో వీసాల కోటా పూర్తి చేసుకునేందుకు అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ మరోసారి లాటరీ నిర్వహించింది. దీంతో..ఉద్యోగులను అమెరికాకు పంపించేందుకు టెక్ కంపెనీలకు మరో అవకాశం వచ్చినట్టైంది. అమెరికా ప్రభుత్వం ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది.  


అమెరికా వెళ్లేందుకు అనేక మంది టెకీలు హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతున్న విషయం తెలిసిందే. 2022లో వివిధ కంపెనీలు హెచ్-1బీ వీసా కోసం ఉద్యోగుల తరపున(స్పాన్సర్) దాదాపు 3 లక్షల దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో దాదాపు 60 శాతం భారతీయ ఉద్యోగుల దరఖాస్తులే. ఇక ప్రస్తుతమున్న ఈ-రిజిస్ట్రేషన్ విధానంలో కంపెనీలు వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో లబ్ధిదారుల ప్రాథమిక వివరాలు ఇస్తే సరిపోతుంది. లాటరీలో దరఖాస్తులు ఎంపికయ్యాక పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మూడో విడత లాటరీకి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 లోపు పూర్తి వివరాలు సమర్పించాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. 


కరోనా సంక్షోభం కారణంగా కంపెనీలు ముందుగా అనుకున్న ప్రకారం తమ ఉద్యోగులను అమెరికాకు పంపించలేకపోవడంతో..వీసా కోటా పూర్తి చేసేందుకు మరో లాటరీ నిర్వహించాల్సి వచ్చి ఉండొచ్చని అమెరికాలోని ప్రముఖ న్యాయసేవల కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థను బురిడీ కొట్టించే అవకాశాలను కొట్టి పారేయలేమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘అనేక కంపెనీలు హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకుని, చివరి నిమిషంలో కాంట్రాక్టులు లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుని ఉండొచ్చు! దీంతో.. కోటా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మూడోసారి లాటరీ నిర్వహించి ఉండొచ్చు.  లేదా.. ఒకే ఉద్యోగి వివిధ కంపెనీలతో దరఖాస్తు చేయించి, హెచ్-1బీ వీసాకు ఎంపికైయ్యే అవకాశాన్ని పెంచుకుని ఉండొచ్చు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలకు చివరి నిమిషంలో ఉద్యోగులు అందుబాటులో లేక ఇబ్బంది పడి ఉంటాయి.’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణాలు ఏమైనప్పటికీ..ప్రస్తుత లాటరీ విధానాన్ని అమెరికా ప్రభుత్వం సమీక్షించాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-11-21T02:20:04+05:30 IST